ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రజాధనాన్ని సలహాదారుల పేరుతో.. సాక్షి ఉద్యోగులకు జీతాల రూపంలో.. పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తోందన్న ఆరోపణలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. సాక్షిలో లక్షల్లో జీతాలు చేసుకునే వారిని… జగన్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ వస్తున్నారు. అందుకే.. ఈ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా.. . దేవులపల్లి అమర్ అనే మరో సాక్షి పేరోల్‌లో ఉన్న ప్రముఖ జర్నలిస్టునూ.. ఏపీ సర్కార్ సలహాదారుల జాబితాలో చేర్చేశారు. దేవులపల్లి అమర్ సాక్షికి చేస్తున్న సేవను బట్టి… జీవీడీ కృష్ణమోహన్ కు ఇచ్చినంత జీతభత్యాలు ఇస్తారు. అంటే.. ఏడాదికి రూ. కోటిన్నర. ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.
అయితే బంధువర్గం.. లేకపోతే సాక్షి ఉద్యోగులకా…?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారులను.. విపరీతంగా నియమించారు. దాదాపుగా ఇప్పటికే పదిహేను మంది వరకూ సలహాదారులుగా నియమించారు. మీడియా వ్యవహారాల దగ్గర్నుంచి ఎన్నారై వ్యవహారాల వరకూ.. అనేక మంది సలహాదారులు నియమితులయ్యారు. వీరందరూ… అయితే జగన్మోహన్ రెడ్డి బంధువర్గం లేకపోతే..సాక్షి ఉద్యోగులే. ఓ సామాజికవర్గానికి లభించిన అత్యధిక ప్రాధాన్యతలో భాగంగా.. ఏ రాష్ట్రం అన్నది కూడా చూసుకోకుండా పదవులు కట్టబెట్టారు. జీవీడీ కృష్ణమోహన్, పూడి శ్రీహరి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్.. వీరు సాక్షి నుంచి వచ్చిన సలహాదారులు. వీరందరికీ.. ఎనిమిది మంది స్టాఫ్‌ను నియమించుకునే అవకాశాన్నిచ్చారు. వీరందరూ.. మళ్లీ సాక్షి సిబ్బందినే నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమకారునికి ఏపీ సలహాదారు పదవా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా… 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిందేనని.. జగన్మోహన్ రెడ్డి చట్టం చేశారు. అయితే… ఆయన మాత్రం.. ఏపీ సర్కార్‌లో తెలంగాణ వారికి పదవులు కట్టబెట్టేస్తున్నారు. ఏపీ సర్కార్ కు కొత్త సలహాదారు అయిన.. దేవులపల్లి అమర్.. తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో… తన వంతు పాత్ర పోషించారు. ఏపీ విషయంలో.. ఎంత వ్యతిరేకత చూపించాలో.. చూపించి ఇతర జర్నలిస్టులకూ ఆదర్శంగా నిలిచారు. ఆయన ఇప్పటికీ.. ఏపీ, తెలంగాణ ప్రయోజనాల విషయానికి వస్తే.. తెలంగాణ ప్రయోజనాల గురించే మాట్లాడతారు. ఎందుకంటే.. ఆయన తెలంగాణ వ్యక్తి. ఇప్పుడు.. ఆయన ఏపీ సర్కార్ నుంచి.. ఏపీ ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుల నుంచి లక్షల్లో జీతభత్యాలు పొందబోతున్నారు. ఆయన ఇచ్చిన అంతర్రాష్ట్ర సలహాదారు డిజిగ్నేషన్ ను బట్టి … ఆయన అమరావతి నుంచి పని చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఇంకొంత మంది సాక్షి పెద్ద జీతగాళ్లు రెడీగా ఉన్నారా..?
సాక్షిలో మరికొంత మంది పెద్ద జీతగాళ్లు కూడా.. ఏపీ సర్కార్‌లో ఏదో పదవి ఇచ్చేందుకు.. ఇప్పటికే ప్రక్రియ పూర్తయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిపై.. విపరీతమైన అభిమానం చూపి… సాక్షి స్క్రీన్ పై మెరిసిపోయే… కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టుకు..ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయనకు కూడా.. ఓ పెద్ద పదవే రెడీగా ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి.. రేపో మాపో ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక.. సాక్షిలోని మరికొంత మంది పీఆర్వో టీముల్లో.. ఇతర చోట్ల… అపాయింట్మెంట్ ఆర్డర్స్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే.. బంధువులు.. లేకపోతే సాక్షి ఉద్యోగులు … తెలంగాణ వారైనా పర్వాలేదు అన్నట్లుగా.. నియామకాలు చేస్తూ.. ఏపీ ప్రజల పన్నుల డబ్బులను సర్కార్ పందేరం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.