వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మీద సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం ఇటీవల జనసేన పార్టీని కేంద్రంగా చేసుకుని పలు ఆరోపణలు గుప్పిస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు పార్టీకి పెద్ద ఎత్తున నిధులు సేకరించాలని గత రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. తాము సేకరించిన విరాళాల మొత్తం ఎంత అన్నది కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ప్రకటించడానికి వారు సమాయత్తం అవుతున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇటీవల ఒక ప్రచారం ప్రారంభించింది. జనసేన పార్టీ దగ్గర విపరీతంగా బ్లాక్ మనీ ఉందని, పైగా చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ డబ్బులు ఇచ్చాడు అని, ఆ డబ్బుని జనసేన పార్టీ కార్యకర్తల నుండి సేకరించిన వైట్ మనీగా చూపించబోతోంది అని అంటూ వైయస్సార్సీపి సోషల్ మీడియా వ్యాఖ్యలు చేసింది. అదే సోషల్ మీడియా వేదికగా జనసేన అభిమానులు, వైఎస్ఆర్ సీపీ మీద విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వేలకోట్ల డబ్బులు పంచి పెట్టింది ఎవరో అందరికీ తెలుసని, పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్టు వైఎస్ఆర్సిపి పార్టీకి ఇతర పార్టీలు కూడా బ్లాక్ మనీ తోనే మనుగడ సాగిస్తున్నాయి అనే అభిప్రాయం ఉందని, అసలు 2018 మార్చి 14 నుండి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఒక్క మీడియా కూడా చూపక పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీయేనని, తెలుగుదేశం పార్టీ మీద జగన్ కంటే ఎక్కువగా విరుచుకుపడింది తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని, ఇలా రకరకాలుగా జన సైనికులు వైఎస్ఆర్సిపి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. అదీకాక ఇటీవల వై ఎస్ ఆర్ సి పి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగించే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ, ఇతరులకు చెప్పడానికి మాత్రమే మీ పార్టీ నీతులు ఉంటాయా? మీరు వాటిని పాటించరా అంటూ జనసేన అభిమానులు వైఎస్ఆర్ సీపీ ధోరణి ని విమర్శించారు.
అయితే ఈ వాగ్వివాదం మొత్తం జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఆ పార్టీ చట్టపరంగా ముందుకు వెళ్లడానికి సమాయత్తమవుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మరి విపక్షాలు చేసే ఫిర్యాదులకు పోలీసులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాలి.