రాజధాని నగరం అమరావతిలో ఉంచుతారా, మరో చోటికి మార్చుతారా అనే చర్చకు తెర లేపింది ఎవరూ.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గత నాలుగు రోజులుగా తీవ్ర గందరగోళానికి కారణం ఆయన వ్యాఖ్యలే. అమరావతి ముంపు ప్రాంతమనీ, రాజధాని నిర్మాణ వ్యయం కూడా ఎక్కువైపోతోందనీ, రాజధాని విషయమై పార్టీలో జరుగుతున్న చర్చనే తాను బయటపెట్టానంటూ మాట్లాడింది ఆయనే! ఆయన మాటల్నే మీడియా కూడా యథాతథంగా ప్రసారం చేసింది. మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే టీడీపీ ఆపగలదా అంటూ కొడాలి నాని సవాళ్లు కూడా చేశారు. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యలేదు. అయితే, ఇప్పుడు ఇంత రచ్చ జరిగాక… ప్రతిపక్షం తీవ్ర విమర్శలకు దిగాక.. రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళనపడ్డాక… తీరిగ్గా ఇప్పుడు స్పందించారు ఆమాత్యవర్యులు!
రాజధాని మార్పు సంకేతాలు ఇచ్చేసిన తరువాత గడచిన నాలుగైదు రోజులుగా బొత్స మీడియా ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న ఒకరోజు ముందు ఆయన స్పందించేసి… తూచ్, అబ్బే, తొండి, రాజధాని అమరావతి తరలింపు గురించి నేనలా మాట్లాడలేదే, తాను మాట్లాడింది కేవలం వరదల గురించి మాత్రమే కదా అని బొత్స మీడియాతో ఇప్పుడు చెబుతున్నారు! తన వ్యాఖ్యల్ని కొన్ని మీడియా సంస్థలు, తెలుగుదేశం నేతలు కలిసి పూర్తిగా వక్రీకరించేశారని నిందని తోసేశారు! సరే, నాలుగు రోజులుగా వక్రీకరణ తీవ్రస్థాయిలో జరుగుతుంటే మంత్రి ఎందుకు స్పందించలేదో ఆయనకే తెలియాలి. శివరామకృష్ణ రిపోర్టు కాకుండా నారాయణ నివేదికను చంద్రబాబు నాయుడు అమలు చేశారని బొత్స విమర్శించారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతల భూములున్నాయి కాబట్టే ఆయన భయపడుతున్నారన్నారు. చెన్నై, ముంబై నగరాలు ఎప్పుడో కట్టినవనీ, ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంటే అక్కడ కట్టేవారా అంటూ ప్రశ్నించారు!
అమరావతిలోనే రాజధాని ఉంటుందా ఉండదా అనే ప్రశ్నకు మాత్రం బొత్స సూటిగా సమాధానం చెప్పలేదు. ఆ గందరగోళాన్ని అలాగే కొనసాగించారు! నాలుగు రోజులుగా మౌనంగా ఉండి, ఇప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చినట్టయితే…? ఏముంది, ముఖ్యమంత్రి తిరిగి రాష్ట్రానికి వచ్చేస్తున్నారు! ఇక్కడికి రాగానే బొత్స వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి కారణం బొత్స. కాబట్టి, బొత్సకు సీఎం క్లాస్ తీసుకున్నా ఆశ్చర్యం లేదనే అభిప్రాయమూ ఉంది! అందుకే, ముఖ్యమంత్రి వచ్చేలోగా… దీన్ని ఎవరిపైనో తేసేసి, అబ్బెబ్బే, అదేం లేదూ నాకేం తెల్దూ… వాళ్లెవరో వక్రీకరించేశారు, అని చెప్పుకోవడం కోసమే తాజా వ్యాఖ్యలు అన్నట్టున్నాయి.