తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎప్పటికప్పుడు ఈ చర్చ తెర మీదికి రావడం… అలాంటి పరిస్థితి లేదన్నట్టుగా కీలకనేతలు సంకేతాలు ఇవ్వడం, కొన్నాళ్లపాటు మౌనం, మళ్లీ అదే చర్చ! ఇప్పుడు మరోసారి తెర మీదికి వస్తోంది తెరాస కీలక నేత హరీష్ రావు ప్రాధాన్యతాంశం! ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే, ఇంకా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అయితే, గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆయన మేనల్లుడు హరీష్ రావుకి మధ్య దూరం పెరిగిందని కథనాలు వినిపించేవి. వాటిని దూరం చేస్తూ… ఆమధ్య చింతమడక గ్రామంలో ఈ ఇద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, తాజాగా ఇప్పుడు మరోసారి హరీష్ ని ముఖ్యమంత్రి దూరం పెడుతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో మళ్లీ చర్చనీయంగా మారినట్టు సమాచారం.
గజ్వేల్ నియోజకవర్గంలో ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. మంత్రులు, కలెక్టర్లతో కలిసి అక్కడో పంప్ హౌస్ ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమంలో హరీష్ రావు కనిపించలేదు. సొంత జిల్లా సిద్ధిపేటలో ముఖ్యమంత్రి పర్యటిస్తే.. హరీష్ రావు ఎందుకు రాలేదూ అనేదే ఇప్పుడు చర్చ. పోనీ, ఆయన వేరే పనిమీద ఎక్కడికైనా వెళ్లారా.. అంటే, ముఖ్యమంత్రి వచ్చిన రోజున ఆయన అక్కడే ఉన్నారట! నిజానికి, గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి బదులుగా హరీష్ రావు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. అయినాసరే, సీఎం పర్యటన సందర్భంలో ఆయన రాలేదు. ముఖ్యమంత్రికీ ఆయనకీ మధ్య ఈ మధ్య దూరం పెరుగుతోంది కాబట్టే, గతంలో మాదిరిగా క్రియాశీలంగా వ్యవహరించడాన్ని హరీష్ రావు తగ్గించుకున్నారనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం హరీష్ రావు మంత్రి కాదు. కాబట్టి ఆయనకి ప్రోటోకాల్ లాంటివేవీ ఉండవు. ముఖ్యమంత్రి పర్యటనకు కూడా ఆహ్వానించాలని రూలేం లేదు. కానీ, గజ్వేల్ అభివృద్ధికి కృషి చేశారు కాబట్టి… కనీసం ఆ నేపథ్యంలోనైనా సీఎం పర్యటన సందర్భంగా ఆయన్ని ఆహ్వానించి ఉంటే బాగుండేమో అనేది పార్టీలో కొంతమంది అభిప్రాయం. సీఎం, హరీష్ ల మధ్య గ్యాప్ పెరుగుతోందనడానికి ఇది తాజా సాక్ష్యమని కొందరు అంటున్నారు. అయితే, త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ సూచనలున్నాయి. హరీష్ రావుకి పదవి ఇస్తారు. ప్రాధాన్యత ఉన్న శాఖనే అప్పగిస్తారనే అంచనాలున్నాయి. అక్కడితో ఈచర్చ ఆగే అవకాశాలున్నాయి.