రెండోసారి ప్రధాని మంత్రి అయ్యాక నరేంద్ర మోడీ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని ఎవ్వరూ కాదనరు. ట్రిపుల్ తలాక్ రద్దుగానీ, కాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు విషయంలోగానీ భాజపా సర్కారు చూపించిన చొరవ ప్రశంసనీయమే. అయితే, కాశ్మీరు విషయంలో మోడీ చూపించిన చొరవను ఏకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్థాయి ప్రయత్నంగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడెమీలో జరిగిన 70వ ఐ.పి.ఎస్. బ్చాచ్ పాసింగ్ అవుట్ సెర్మనీలో పాల్గొనడానికి అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సురక్ష భారత్ అనే నినాదంతో మోడీ సర్కారు పనిచేస్తుందన్నారు.
అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఉక్కు మనిషి అన్నారనీ, ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఉక్కు మనిషే అని అమిత్ షా చెప్పారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ తో సహా దాదాపు 500 సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కృషి మరువలేనిదనీ, అదే తరహాలో నరేంద్ర మోడీ కూడా కాశ్మీరు అంశంలో చొరవ చూపించి ఆర్టికల్ 370 రద్దు చేశారన్నారు. జమ్మూకాశ్మీర్ కి విముక్తి కల్పించడంతో మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాలకులు, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల భుజాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. సురక్ష భారత్ లక్ష్యాన్ని మోడీ పెట్టుకున్నారనీ, దాన్ని సాధించే దిశగా ఐపీఎస్ లు పనిచేయాలన్నారు. ప్రజల్లో పోలీసులపై, భద్రతపై నమ్మకం పెంచే విధంగా విధి నిర్వహణ ఉండాలని చెప్పారు.
నాడు సంస్థానాల విలీనం కోసం పటేల్ తీసుకున్న చొరవ వేరు, ఇవాళ్ల కాశ్మీర్ లో 370 రద్దుకి మోడీ తీసుకున్న చొరవ వేరు. వాస్తవానికి, రెండింటినీ ఒకే తరహా ప్రయత్నం అని పోల్చడమే సరైంది కాదు. రెండూ ముఖ్యమైన అంశాలే, విడివిడిగా దేనికదే ప్రత్యేకమైంది. కానీ మరీ పటేల్ ఉక్కు మనిషి అన్నారని… మోడీని కూడా ఉక్కు మనిషి అని అమిత్ షా అభివర్ణించడం కాస్త అతిగా అనిపిస్తోంది. కాశ్మీరు అంశంలో మోడీ సర్కారు చొరవ కచ్చితంగా ప్రశంసనీయమే, సాహసోపేత నిర్ణయమే. అయితే, ఈ నిర్ణయం తీసుకునేందుకు కావాల్సిన రాజకీయ పరిస్థితులు మోడీ సర్కారుకు ఇప్పుడు అనుకూలించాయి. దీన్ని సంస్థానాల విలీనానికి పటేల్ చూపిన చొరవతో సరిపోల్చలేం కదా!