వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు కనిపిస్తున్నాయి. టన్ను ఇసుక.. రూ. 30 కే ఇవ్వబోతున్నారు. ఇంటికి తీసుకొచ్చి మరీ.. ఎక్కడ కావాలంటే.. అక్కడ పోసి వెళ్లబోతున్నారు. ఇదే కాదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నారు కాబట్టి.. ఆ స్ఛాయిలో.. ప్రభుత్వానికి షాపులు అద్దెకిచ్చేందుకు… యజమానులు కూడా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు రూపాయికే అద్దెకిస్తామంటూ.. వందల రూపాయిల ఖర్చుతో…టెండర్లు దాఖలు చేస్తున్నారు.
మద్యం షాపులకు రూ. 1కే అద్దెకిస్తామని క్యూలు..!
ఏపీ సర్కార్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి తెస్తోంది. దీని ప్రకారం.. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించబోతోంది. దీనికి షాపులు కావాలి కాబట్టి… అద్దెకు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఓపెన్ టెండర్లు స్వీకరించారు. ఏలూరు, పెదవేగి మండలాల పరిధిలో ఒకరికొకరు పోటీపడి అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిచ్చేందుకు ఒప్పుకున్నారు. కేవలం రూ.1కే షాపును ఇచ్చేందుకు ముందుకు వచ్చారట. ఏలూరు నగరంలోని 30వ డివిజన్లో షాపు, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని మద్యం దుకాణాలను రూ.1కే ప్రభుత్వానికి అద్దెకు ఇస్తున్నారని వైసీపీ మీడియా సాక్షినే.. ఘనంగా ప్రకటిస్తోంది.
ఇసుక టన్ను రూ. 30కే..!
ప్రభుత్వం ఎట్టకేలకు నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెలుస్తోంది. దీనికి సంబంధించి.. రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుక తరలించేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో రూ. 30కే టన్ను ఇసుక తరలిస్తామని టెండర్లు వేశారు. ఒక్కో యూనిట్‌కు సంబంధించి రేవులో ఇసుక లోడింగ్ చేసే కూలీల ఖర్చు, అక్కడి నుంచి స్టాక్‌పాయింట్ వరకు రవాణా ఖర్చు, మళ్లీ స్టాక్‌పాయింట్‌లో అన్లోడింగ్.. ఆ తర్వాత కస్టమర్‌కు ఇసుక లోడింగ్ ఖర్చు వరకూ టెండరుదారుడిదే బాధ్యత. అంతా కలిపి.. రూ. 30లకే తరలిస్తారట. ఇదెలా సాధ్యమని ఎవరూ ఆలోచించడం లేదు.
ఎందుకిలా చేస్తున్నారు…?
మద్యం షాపులకు రూ. ఒక్కటికే… తమ షాపు అద్దెకు ఇస్తే.. యజమానులకు వచ్చే లాభం ఏమిటి..? రూ. 30కి ఇసుక తరలిస్తే.. వారికి ఇచ్చే లాభం ఏమిటి..? ఇవన్నీ… చాలా మందికి వచ్చే సందేహాలు. ఎలాగోలా.. వ్యవస్థలో ఇరుక్కుంటే.. ఒక్క రూపాయినే కోటిగా మార్చుకునే వెసులుబాటు వారికి వస్తుంది… రూ. 30ని మూడు కోట్లుగా మార్చుకునే సౌలభ్యం వస్తుంది. అందుకే.. వారిలా.. చేస్తున్నారని.. ఎవరికైనా అర్థమైపోతుంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోందో..?