నాలుగు భాషల్లో సినిమా తీయడం కాదు, నాలుగు భాషల్లోనూ సినిమాని ప్రమోట్ చేసుకోవడమే చాలా కష్టం. ఈ విషయం ప్రభాస్‌కి బాగా అర్థమవుతోంది. మీడియాతో మాట్లాడడానికి సిగ్గు పడిపోయే ప్రభాస్.. పదిహేను రోజుల నుంచీ.. మీడియా మధ్యనే ఉంటున్నాడు. సాహోని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా… తెగ తిరుగుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు. చిన్న చిన్న పత్రికలకు సైతం.. ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. గంటల కొద్దీ.. ప్రమోషన్లతోనే గడుపుతున్నాడు. 250 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఇది. అందుకే ప్రమోట్ చేసుకోవడం అత్యవసరం. బాహుబలి అయితే రాజమౌళి ట్యాగ్ లైన్ ఉండడం వల్ల, ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ వర్కవుట్ అవ్వడం వల్ల ప్రభాస్ ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సాహో పరిస్థితి వేరు. కేవలం ప్రభాస్ పేరుపై మార్కెట్ అయ్యింది. ప్రభాస్‌ని చూసే జనాలు థియేటర్లకు రావాలి. అందుకే.. ప్రమోషన్లని సైతం ప్రభాస్ ముందుండి నడిపిస్తున్నాడు. తెలుగు మీడియాకే ఇంత వరకూ టచ్‌లోకి రాలేకపోయాడు ప్రభాస్. సోమ, మంగళవారాలు తెలుగు మీడియాకి టైమ్ కేటాయించాడు. ఈ రెండు రోజులూ మీడియాకి అందుబాటులో ఉండబోతున్నాడు ప్రభాస్. వినాయక చవితి వరకూ ఈ సినిమాని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది సాహో టీమ్. ఆ తరవాతే ప్రభాస్ ఫ్రీ అవుతాడు. సాహో హడావుడి ముగిసిన వెంటనే కాస్త విశ్రాంతి తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అయితే.. `జాన్` చిత్రబృందం మాత్రం ప్రభాస్ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.