తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత… తొలి సారి సభ్యత్వ నమోదు బాధ్యతల్ని అధికారికంగా తీసుకున్నారు కేటీఆర్. ఆయన పార్టీ యంత్రాంగాన్ని మొత్తం ఉరుకులు పరుగులు పెట్టించారు. అయితే.. ఆదర్శంగా ఉండాల్సిన కేటీఆర్ మాత్రం.. మిగతా రాష్ట్రం మొత్తంపై దృష్టి పెట్టి.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లను లైట్ తీసుకున్నారు. ఫలితంగా.. సభ్యత్వాల్లో.. టాప్ టెన్ నియోజకవర్గాల్లో సిరిసిల్లకు స్థానం దక్కలేదు. ఇది టీఆర్ఎస్లో చర్చనీయాంశమవుతోంది.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పదే పదే పొడిగింపులు ఇచ్చిన తర్వాత.. ఇక అంతకు మించి.. ఏమీ రావని తేలిన తర్వాత.. ముగింపు ప్రకటన ఇచ్చారు. మొత్తం సభ్యత్వాలపై.. కేటీఆర్ సమీక్ష కూడా చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వం ఎంతెంత అయింది ఆరా తీశారు. నియోజక వర్గాల వారీగా పార్టీ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయిన నేతలను అభినందించారు. అలా అభినందనలు .. అందుకున్న టాప్ టెన్ నియోజకవర్గాల్లో .. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల లేదు. గత ఎన్నికల్లో ఆయనకు దాదాపుగా… 90వేల మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీలో సగం కూడా.. సభ్యత్వాలను.. సిరిసిల్ల టీఆర్ఎస్ నేతలు చేయించలేకపోయారు.
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు 60 లక్షల సభ్యత్వం నమోదు అయింది. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. గ్రేటర్లో అనుకున్నంతగా అవలేదు. మొత్తాన్ని సమీక్ష చేసిన కేటీఆర్… ఇక నుంచి… పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ రెడీ చేసుకుంటారు. అయితే.. కేటీఆర్.. పార్టీ క్యాడర్ ను… స్ఫూర్తివంతంగా నడపాలంటే.. తన పనితీరు.. అందరి కంటే మెరుగ్గా ఉందని చూపించాలన్న భావన పార్టీలో ఇతర నేతల్లో వ్యక్తమవుతోంది.