తెలంగాణలో భాజపాకి నాయకులు కావాలి. అందుకే ఇతర పార్టీల్లో కాస్త కీలకంగా ఉన్న, లేదా ప్రాధాన్యత కోల్పోయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా పిలిచి మరీ కాషాయ ధారణ చేయిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులు రావడం ఒకెత్తు అయితే, తెలుగుదేశం నుంచి ఎవరైనా వస్తారంటే భాజపాకి ఇంకా ఆనందమే కదా! నిజానికి, తెలంగాణ టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు ఇప్పటికే కమలం గూటికి చేరేశారు. ఇప్పుడు టీటీడీపీలో నాయకులంటే ఇద్దరో ముగ్గురో కనిపిస్తున్నారు. వారిని కూడా ఆకర్షించే పనిలో కమలనాథులున్నారు. టీటీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా త్వరలోనే సైకిల్ దిగేయబోతున్నట్టు సమాచారం.
గతవారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే అమిత్ షాని కలిసేందుకు రేవూరి చాలా ప్రయత్నించారట! అయితే రోజంతా వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న హోంమంత్రి… రేవూరికి టైం ఇవ్వలేదు. కొన్ని నిమిషాలైనా ఆయనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే… అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియగానే ఉన్న సమావేశాలన్నింటినీ రద్దు చేసుకుని అమిత్ షా ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో రేవూరి భేటీ కాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అమిత్ షాతో ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశాలంటూ ఏమున్నాయో తెలీదు! ఓసారి మర్యాద పూర్వకంగా కలిస్తే, చేరిక ముహూర్తాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేవూరి పార్టీకి దూరమైతే తెలంగాణలో టీడీపీకి మరో షాక్ అవుతుంది. అయితే, టీడీపీకి షాక్ అని మీడియా అంటోందిగానీ, ఆ తీవ్రతను ఆ పార్టీ ఫీలౌతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. గడచిన వారంలో గరికపాటి పార్టీకి దూరమయ్యారు. దేవేందర్ గౌడ్ అదే బాటలో ఉన్నారు. ఇప్పుడు ఈయనా దూరమైతే టీడీపీలో మిగిలేదెవరు..? కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరమౌతున్నా వారిని ఆపే ప్రయత్నం పార్టీ నాయకత్వం చేయడమే లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పరిణామాలపై దృష్టి సారిస్తున్నట్టు కనిపించడం లేదు. గతంలో కొన్నాళ్లు తెలంగాణ శాఖ బాధ్యతలు చూసిన నారా లోకేష్ కూడా ఇటువైపు చూడటం లేదు! ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.