మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకూ ఆహ్వానం వచ్చింది. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై… ఆ రాష్ట్ర సర్కార్ నోరు మెదపలేదు. సీఎం ఢిల్లీ టూర్‌కి ఎలాంటి ఏర్పాట్లూ చేసుకోలేదు కాబట్టి… కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండకపోవచ్చంటున్నారు. అయితే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయబోతోంది. అమిత్ షాతో.. అధికారికమైన ముఖ్యమంత్రుల సమావేశం అయిపోయిన తర్వాత కూడా జగన్ చాలా బిజీగా ఉంటారు. అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ గత మూడు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాలు.. కేంద్రానికి కూడా ఆగ్రహం తెప్పించాయి. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల రద్దుపై.. కేంద్రం ఎన్ని సార్లు లేఖలు రాసినా .. హెచ్చరించినా.. జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేయడం లేదు. ఇతర దేశాలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ముందుకే వెళ్లి.. తాము మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామని.. వారిపైకి నెట్టేశారు. పోలవరం రివర్స్ టెండర్ల పరిస్థితీ అంతే. ఇక రాజధాని విషయంలోనూ.. కేంద్రానికే చెప్పి చేస్తున్నామన్న వాదనను… నేరుగా కాకుండా.. అంతర్గతంగా తీసుకు వస్తున్నారు. వీటిపై.. జగన్మోహన్ రెడ్డి.. అమిత్ షాకు వివరించి.. కేంద్రం నుంచి అభ్యంతరాలు లేకుండా చూసుకుంటారని… ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి నైజం ప్రకారం… ఆయన రివర్స్ టెండరింగ్ పైనా… పీపీఏల రద్దుపైనా వెనక్కి తగ్గే అవకాశం లేదు. కేంద్రాన్ని ఒప్పించినా.. ఒప్పించకపోయినా.. ఆయన ముందుకే వెళ్తారు. కానీ… కేంద్రాన్ని ఒప్పిస్తే.. ఎలాంటి తలనొప్పులు ఉండవని.. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మోడీ, అమిత్ షాలకు.. ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం కాబట్టి… తమ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తారని జగన్ భావిస్తున్నారు. మూడు రోజుల కిందట.. విజయసాయిరెడ్డి, కల్లాం అజేయరెడ్డిలను పిలిపించుకుని… పీఎంవో వివరణ కూడా తీసుకుంది. ఈ క్రమంలో… అమిత్ షాతో పాటు.. జలశక్తి మంత్రి షెకావత్‌తోనూ జగన్ ప్రత్యేకంగా సమావేశమై…. రివర్స్ టెండర్లు, పీపీఏల రద్దు వంటి వాటికి అనుమతి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.