మొదటి సినిమా స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వం లో పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’లోనే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘స్పీడున్నోడు’. ‘సుడిగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ఎన్నో విజయవంతమైన రి-మేక్ చిత్రాల రారాజు భీమనేని శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం చేసిన తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సుందర పాండ్యన్’ రీమేక్ సినిమానే ఇది.హరహర మహదేవ్ ఫేం సొనారిక బడోరియా హీరోయిన్ గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ సినిమా ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
కథాపరం గా కర్నూల్ జిల్లా రాప్తాడు నియోజగావర్గంలోని వెంకటాపురం – రామగిరి ప్రాంతాలకు మధ్య ఈ సినిమా జరుగుతుంది. ఇక అసలు కథలోకి వెళితే రామగిరి పంచాయితీ పెద్ద అయిన వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్). డిగ్రీ పూర్తి నాలుగేళ్ళయినా ఎలాంటి పనీ లేకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ని బిందాస్ గా గడుపుతుంటాడు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికన్నా సిద్దమవుతాడు అది శోభన్ వీక్ నెస్ .. . అలా తన ఫ్రెండ్ గిరి(మధు) ఒకమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిని గిరికి సెట్ చేయడం కోసం ఇక రోజు తను వెళ్ళే బస్ ఎక్కుతారు. ఆ అమ్మాయే మన హీరోయిన్ వాసంతి(సొనారిక బడోరియా).అయితే గిరిని వాసంతి ప్రేమించడంలేదని తెలుసుకుంటాడు. అలాగే నాలుగేళ్లుగా తన వెంట పడతున్న చిట్టిని కూడా వాసంతి ప్రేమించడంలేదని, తనని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు శోభన్. గిరికి వాసంతికి సెట్ చేసే క్రమంలో వాసంతి శోభన్ ప్రేమలో పడుతుంది. ఇంటర్ లోనే వాసంతిని ప్రేమించిన శోభన్ ఆమెను ప్రేమిస్తాడు. ఈ ఇద్దరి ప్రేమ వాసంతి ఇంట్లో తెలిసిసోతుంది.ఇదిలా ఉండాగానే శోభన్ కి మరికొన్ని సమస్యలు రావడం మొదలవుతాయి వాసంతి తండ్రి రామచంద్రప్ప (రావు రమేష్) తన పెద్ద అల్లుడు తమ్ముడు జగన్ (కబీర్ దూహన్) కి వాసంతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. వాసంతిని ప్రేమించిన జగన్, చిట్టి, గిరి ముగ్గురూ శోభన్ ఫ్రెండ్స్. తనను ప్రేమించడంలేదని వాసంతిపై యాసిడ్ పోయడానికి ట్రై చేస్తాడు చిట్టి. అది ఆపడానికి శోభన్ ట్రై చేయడం, ఆ సమయంలో యాక్సిడెంటల్ గా చిట్టి బస్సులోంచి పడిపోయి చనిపోవడం జరుగుతుంది. వాసంతి ప్రేమను, శోభన్ ప్రేమను అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు వీరి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటారు. తనను కాదన్న వాసంతిని పెళ్లి చేసుకోవడం పట్ల శోభన్ పై జగన్ కోపంగా ఉంటాడు. మరోవైపు చిట్టి చనిపోవడానికి కారణం శోభన్ అని భావించే చిట్టి ఫ్రెండ్ కూడా శోభన్ పై కోపంగా ఉంటాడు. జగన్, చిట్టి ఫ్రెండ్ కలిసి శోభన్ ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. మరి ఫైనల్ గా ఫ్రెండ్స్ వేసిన ప్లాన్ కి శోభన్ బలైపోతాడా… వాసంతిని చేసుకుంటాడా.. ఫ్రెండ్ షిప్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడని శోభన్ సరైన ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుంటాడా అనేదే ఈ చిత్ర కథ. శోభన్ కి ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసారు? వీరికి శోభన్ కి ఏమన్నా సంబంధం ఉందా? శోభన్ – వాసంతిల ప్రేమ వల్ల జగన్, మదన్ లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
తొలి సినిమా ‘అల్లుడు శీను’లోనే బెల్లంకొండ శ్రీనివాస్ నటన పరంగా, డ్యాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇక రెండో సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ సన్నివేశాల్లో బాగా నటించాడు.ఇంట్రడక్షన్ సాంగ్ అధరకొట్టాడు. బెల్లంకొండ మరియు తమన్నా సాంగ్ లో శ్రీనివాస్ స్టెప్స్ అదుర్స్. వాసంతిగా సోనారికా బాగుంది. కొన్ని సీన్స్ లో పల్లెటూరి అమ్మాయిలా లంగావొనీల్లో కనిపించి, పాటల్లో మాత్రం అల్ట్రా గ్లామరస్ గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, పోసాని, పృథ్వీ, కబీర్ ఎవరి పాత్రలకు వారు పూర్తి న్యాయం చేసారు. హీరోయిన్ అత్తగా ఝూన్సీ మంచి పాత్ర చేసింది .శ్రీనివాస్ రెడ్డి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి సపోర్ట్ ని ఇచ్చాడు. మరో వైపు ఇల్లరికపు అల్లుల్లుగా పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్ లు అక్కడక్కడా నవ్వించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక వర్గం పని తీరు :
రీ-మేక్ సినిమాలు సక్సెస్ చేయడంలో భీమినేని శ్రీనివాసరావు దిట్ట. కథలోని ఆత్మ చెడిపోకుండా, నేటివిటికి తగ్గట్టు మార్పులు చేయడం భీమినేనికి బాగా తెలుసు. ఈ సినిమా తమిళ చిత్రం ‘సుందర్ పాండ్యన్’ కి రీమేక్. మంచి మెసేజ్ తో కూడుకున్న రియలిస్టిక్ స్టోరీ లైన్. తెలుగు నేటివిటికి తగ్గట్టు చాల మార్పులు చేసి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దడానికి డైరెక్టర్ గా, నిర్మాత గా భీమినేని శ్రీనివాసరావు చాలా కృషి చేసారు. అందులో హడ్రేడ్ పెర్సెంట్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతో తెచ్చకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సాంగ్స్, ఫైట్స్ కంపోజ్ చేయించడం, తొలి సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా, ఇంకాస్త మెరుగయ్యాడని ఆడియన్స్ అనుకునేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఫ్రెండ్ షిప్ కి సంబంధించి మరికొన్ని బలమైన సన్నివేశాలు పడి ఉంటే క్లయిమ్యాక్స్ ఆడియన్స్ కి బలంగా కనెక్ట్ అయ్యి ఉండేది. విజయ్ ఉలగనాధ్ అందించిన ఫోటోగ్రఫీ చాల బాగుంది. రాయలసీమ ప్రాంతంలోని లొకేషన్స్ ని చక్కగా తన కెమెరాలో బంధించారు. వసంత్ అందించిన పాటలు బాగున్నాయి. పాటల కోసం వేసిన సెట్స్ బాగున్నాయి. నిర్మాణపు విలువలు సూపర్.
విశ్లేషణ:
స్నేహం ఎంత గొప్పది అనే చెప్పే ఓ కథని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథని జోడించి చెప్పడం బాగుంది. మెయిన్ గా ఈ సినిమా చివరికి వచ్చేసరికి వరుసగా రివీల్ అయ్యే ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ ఎపిసోడ్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చడమే కాకుండా ఫ్రెండ్షిప్ గురించి చెప్పే లైన్స్ ఓ మంచి ఫీల్ ని ఇస్తుంది.‘స్పీడున్నోడు’ సినిమా చాలా స్పీడ్ గా మొదలవ్వడం, అంతే స్పీడ్ గా కథలోకి వెళ్ళడం, అదే స్పీడ్ తో ఎంటర్టైనింగ్ గా పాత్రలని పరిచయం చేయడమే మొదట అందరికీ బాగా నచ్చే పాయింట్. సినిమా ప్రారంభం చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ మరియు లవ్ ట్రాక్ తో సినిమాని ఎంటర్టైనింగ్ గా ముందుకు నడిపించడం సినిమాకి హైలైట్. ఇకపోతే ఈ సినిమాకి ఇంటర్వెల్ బాంగ్ బాగుంటుంది.ఆసక్తికర ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికి సినిమా స్లో అయిపోతుంది, కాకపోతే క్లయిమ్యాక్స్ చూసిన తర్వాత ఫ్రెండ్ షిప్ గురించి బలంగా సన్నివేశాలు పడాల్సిందని మాత్రం ఆడియన్స్ అనుకోకుండా ఉండరు. కేవలం ఒక సిగరెట్ ని ఫ్రెండ్సందరూ కలిసి కాల్చడం, అందరూ కలిసి సెల్ఫీలు దిగినంత మాత్రానా ఫ్రెండ్ షిప్ అంటే ఇలానే ఉండాలని అనిపించుకోదు. హార్ట్ టచింగ్ క్లయిమ్యాక్స్, ఇచ్చిన మెసేజ్ కి ఆడియన్స్ బలంగా కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన సీన్స్ కూడా బలంగా ఉండాలి.అదీకాక పూర్తి డ్రామా ఫార్మాట్ లోకి వెళ్తుంది. ఆ ఎపిసోడ్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. అలాగే ఓవరాల్ రం టైం ని కూడా ఓ 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది. చివరాఖరికి చెప్పేదేంటంటే ఈ స్పీడున్నోడు సినిమాని ఈ వారం లో టైం పాస్ బెస్ట్ ఎంటర్టైనర్ గా చూడదగిన సినిమా.
తెలుగు360.కామ్ రేటింగ్: 2.75/5
బ్యానర్ : గుడ్ విల్ సినిమా
సమర్పణ : భీమినేని రోషితా సాయి
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక బడోరియా, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, కబీర్ దూహన్, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చైతన్య కృష్ణ, షకలక శంకర్,ఝూన్సీ, ప్రగతి, మీనా, విద్యులేఖా రామన్ తదితరులు
మూల కథ : ఎస్.ఆర్.ప్రభాకరన్
మాటలు : ప్రవీణ్ వర్మ, భీమినేని శ్రీనివాసరావు
ఎడిటింగ్ : గౌతంరాజు
సంగీతం : డి.జె.వసంత్
సినిమాటోగ్రఫీ : విజయ్ ఉలగనాథ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్ కూచిబొట్ల
నిర్మాత : భీమినేని సునీత
స్టోరీ డెవలప్ మెంట్, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం – భీమినేని శ్రీనివాసరావు
విడుదల తేది : 05.02.2016