ఆంధ్రప్రదేశ్ రాజకీయం శరవేగంగా మారుతోంది. వైసీపీ ఒక వైపు… మిగతా పార్టలన్నీ మరో వైపు ఉండబోతున్నాయి. కలసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని.. రాజధాని విషయంలో.. ప్రభుత్వంపై పోరాడాలని.. టీడీపీ అధినేత నిర్ణయించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదని… అందరి ఆశీస్సులతో ఈ రాజధాని కొనసాగుతుందిని… చంద్రబాబు రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన.. ఇతర పార్టీలనూ కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రాజధాని కోసం టీడీపీ, బీజేపీ, జనసేన..!
రాజధాని విషయంలో.. జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. ప్రభుత్వం ఒక వైపు… టీడీపీ, బీజేపీ, జనసేన ఒక వైపు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రాజధానిని తీవ్రంగా విమర్శించిన బీజేపీ, జనసేన పార్టీలు కూడా.. కొత్తగా.. అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. గతంలో అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న బీజేపీ నేత కన్నా… ఇప్పుడు.. నిర్మాణాలు కొనసాగించాల్సిందేనంటున్నారు. గతంలో.. అమరావతికి అంత భూమి ఎందుకని వాదించిన పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఉండాల్సిందేనంటున్నారు. అంటే ఒక్కసారిగా సీన్ మారిపోయినట్లే..!. ఇప్పుడు… రాజధాని రైతుల కోసం.. వైసీపీ మినహా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి.
రాజకీయాల్లోనూ కలవడానికి అమరావతి వేదిక..!
తెలుగుదేశం పార్టీనే అమరావతిని ప్రారంభించింది కాబట్టి.. ఈ విషయంలో రైతులకు ఆ పార్టీ నేతలు మొదటి నుంచి మద్దతుగానే ఉన్నారు. ఇక బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే.. గతంలో కొన్ని వ్యతిరేక ప్రకటనలు చేసి ఉన్నాయి. అందుకే.. రాజధాని రైతులు… తమకు అన్యాయం జరగకుండా చూడాలనివ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కలిశారు. టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు.. కన్నా.. రాజధానికి వ్యతిరేక ప్రకటనలు చేశారు. అక్కడ కుంభకోణాలు జరిగిపోతున్నాయని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం… తన విధానాన్ని మార్చేసుకున్నారు. అమరావతిని మార్చడానికి వీల్లేదని ప్రకటించారు. ఆయన అమరావతిని అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయవద్దని….. చెల్లించాల్సిన కౌలును వెంటనే చెల్లించాలని.. ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. సుజనా చౌదరి, సునీల్ ధియోధర్, కన్నా లక్ష్మినారాయణ రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్నారు.
వేగంగా మారనున్న రాజకీయం..!
గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని వారికి మద్దతుగా.. పోరాటం చేశారు. పలుమార్లు.. రాజధానిలో.. పర్యటించారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని వారు చేసిన ఆందోళనలో పాలు పంచుకున్నారు. రాజధానికి అంత భూమి ఎందుకని.. విమర్శలు కూడా చేశారు. అప్పట్లో రాజధాని రైతులు.. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. 95 శాతం మందికిపైగా రైతులు స్వచ్చందంగా భూములు ఇస్తే.. ఇవ్వని ఐదు శాతం మంది రైతుల కోసమే.. పవన్ మాట్లాడుతున్నారని… తమ ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడరని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు.. పవన్ ఆ రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఇప్పుడు.. రాజధాని విషయంలో… అధికార పార్టీ ఒక వైపు.. మిగతా అంతా ఒక వైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇలా అన్ని పార్టీలు.. కలసి పోరాటం చేస్తే.. ఆ బాండింగ్ .. సహజంగానే తదుపరి రాజకీయాలపై పడుతుంది.