” భూములేవీ లేవని మాజీ కేంద్రమంత్రి సవాల్ చేస్తే..మొత్తం బయట పెడతాం..! అధికారంలో ఉన్నవాళ్లం… ఆషామాషీగా మాట్లడం కదా..! …” ఇదీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ… అమరావతి వ్యవహారంపై… సుజనా చౌదరికి విసిరిన సవాల్. అమరావతి పర్యటనకు సుజనా చౌదరి వస్తున్నారని తెలియగానే బొత్స.. ఈ హెచ్చరికలు జారీ చేశారు. బొత్స ఈ మాటలు అన్న కొద్ది గంటల్లోనే.. సుజనా చౌదరి.. రాజధాని గ్రామాలకు వచ్చారు. కన్నా లక్ష్మినారాయణ, సునీల్ ధియోధర్లతో కలిసి… రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. ఈ సమయంలో.. బొత్స సవాల్ గురించి… కూడా మాట్లాడారు. “మంత్రి బొత్స చెప్పినట్లు సవాల్ విసురుతున్నా… రాజధానిలో.. నాకు సెంటు భూమి ఉన్నా బయటపెట్టాల”ని… ఆయన డిమాండ్ చేశారు.
రాజధానిలో తెలుగుదేశం పార్టీ నేతలు వేల ఎకరాలు కొన్నారని… ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఆరోపిస్తోంది. సాక్షి పత్రికల్లో… అనేక కథనాలు ప్రచురించారు. అప్పట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో.. సీబీఐ విచారణకూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో… వారు అధికారంలోకి వచ్చిన తర్వాత … రాజధాని ప్రాంతంలో.. టీడీపీ నేతలు.. కొన్న భూముల వివరాల్ని బయట పెడతారని.. అందరూ అనుకున్నారు. కానీ మూడు నెలలు గడిచిపోయినా… వివరాలు బయట పెట్టలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. ఇప్పటికీ అక్కడ టీడీపీ నేతలకే భూములున్నాయని ఆరోపణలు చేస్తూ ఉంటారు. విజయసాయిరెడ్డి కూడా.. అవే ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ బొత్స లాంటి నేతలు.. సవాల్ చేస్తే బయట పెడతామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సుజనా చౌదరి నేరుగానే సవాల్ చేశారు.
ప్రభుత్వం వైసీపీ చేతుల్లో ఉంది. రాజధాని ప్రాంతంలో ఎవరెవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఎవరెవరు భూములు కొన్నారో… ఒక్క క్లిక్‌తో సమాచారం మొత్తం.. ప్రభుత్వానికి లభిస్తుంది వైసీపీ ప్రచారం చేసినట్లుగా.. ఏమైనా స్కాం జరిగి ఉంటే.. బయట పెట్టడం.. క్షణాల్లో పని. కానీ మూడు నెలలు గడిచినా.. ఇప్పటికీ… ఆరోపణలే చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. మధ్యలో ఓ సారి బాలకృష్ణ ఐదువందల ఎకరాలు కొన్నారంటూ… విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఆరోపణలు చేయడంతో..నేరుగా లోకేషే కౌంటర్ ఇచ్చారు. కానీ దానిపైనా రియాక్షన్ లేదు. ఇప్పుడు… సుజనా చౌదరి సవాల్‌పై బొత్స.. వివరాలు బయట పెడతారో లేదో..?