తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలో ఉంటుందనే సంకేతాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని మంత్రిగా చూడాలని ఉందంటూ తెరాస నేతలు వరుసపెట్టి కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో… పార్టీలో కీలక నేతలుగా ఉంటూ, గత ఎన్నికల్లో ఓటమి పాలైనవారికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. ఓటమిపాలైన సీనియర్లకు అవకాశం కల్పించే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ ఉన్నారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పరాజయం పాలైన సీనియర్ల సేవల్ని పార్టీకి ఏదో ఒక రకంగా వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా ఓటమిపాలైన కొంతమందికి జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా తెరాస అవకాశం కల్పించింది.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ గత ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఇంకా ఓటమిపాలైన సీనియర్లు అంటే… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ శాసన సభాపతి మధుసూదనాచారి, తుమ్మల నాగేశ్వరరావులతోపాటు ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఓటమి తరువాత వీరంతా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే, వారి సీనియారిటీ దృష్ట్యా ఏదో ఒక కీలక పదవిని ఇవ్వడం ద్వారా వారి సేవల్ని వినియోగించుకోవచ్చు అనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. వినోద్ కుమార్ కి పదవి ఇచ్చేసరికి… ఇదే క్రమంలో మిగతావారికి కూడా ప్రాధాన్యత దక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
మంత్రి వర్గ విస్తరణ కూడా త్వరలో ఉండే సూచనలున్నాయి కాబట్టి, ఓటమి పాలైన సీనియర్లలో ఓ ఇద్దరికి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా ఇప్పుడు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరనేది ఇంకా స్పష్టతలేదుగానీ.. కవితకు అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాతి నుంచి ఇప్పటివరకూ తెరాసలో మాజీ ఎంపీ కవిత పాత్ర ఏంటనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. పార్టీ పదవులు మాత్రమే ఆమెకి ఇస్తారనీ, కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. మొత్తానికి, ఓడిన ప్రముఖులకు ప్రాముఖ్యత పెంచే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పొచ్చు.