వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈసారి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. నిధుల కేటాయింపులపై ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు ఓ కొలీక్కి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పారు. ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలోపెట్టుకుని అన్ని శాఖలూ ఖర్చుల విషయంలో క్రమశిక్షణ పాటించాలన్నారు. బడ్జెట్ తయారీ దగ్గర్నుంచీ శాఖలకు నిధుల విడుదల, వాటి ఖర్చుల వరకూ ప్రతీ చోటా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రులు, కార్యదర్శులు, అధికారులు అందరూ సమగ్రమైన అవగాహన పెంచుకోవాలన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహనకు అందరూ రావాలన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది ఈ సందర్భంగా సీఎం చెప్పారు. త్వరలోనే మంత్రులూ కార్యదర్శులతో ఆర్థిక క్రమశిక్షణపై ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ సమావేశమౌతారని వెల్లడించారు. వచ్చే నెల 13, 14వ తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా సెప్టెంబర్ 24లోపు బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఖర్చులు తగ్గించుకోవాలని ఇతర శాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే… ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు గుర్తుకు వచ్చేసిందా అనిపిస్తోంది! ఎందుకంటే, సెక్రటేరియట్ కూల్చివేత, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఆర్థిక క్షమశిక్షణ కోణంలో మాట్లాడితే.. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదిక వాటిని నిర్మించాల్సిన అవసరం ఏముంది..? కోట్ల వ్యయంతో ప్రగతి భవన్ నిర్మించారు. సభలూ సంబరాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు యజ్ఞాలు యాగాలూ అంటూ అదో ఖర్చు. ఇలా విచ్చలవిడిగా ఖర్చులు చేసే సీఎం కేసీఆర్… ఇవాళ్ల ఠక్కున ఆర్థిక క్రమశిక్షణ ఎలాగో నేనే చెబుతా రండీ అంటుంటే, కొత్తగా వినిపిస్తోంది! రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని ఇతరులకు చెప్పేముందు… ఆ పరిస్థితి తెలిసిన ముఖ్యమంత్రి ఆర్థిక క్రమశిక్షణతో ఉంటున్నారా అనేదే ప్రశ్న? ధనిక రాష్ట్రమని చెబుతూ వచ్చి, ఇప్పుడు ఆర్థికమాంద్యం అని మాట్లాడుతున్నారు!