వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీ వ్యూహంతోనే.. అమరావతి విషయంలో ప్రస్తుత కార్యాచరణ నడిపిస్తోందా..? బొత్స సత్యనారాయణ.. వరుసగా.. అదే తరహా ప్రకటనలు చేస్తూ ఉండటం వెనుక అసలు లాజిక్.. వేరే ఉందా..:? ఈ వ్యవహారంలో టీడీపీ అడ్డంగా ఇరుక్కుపోయిందా..?.. అంటే.. అవుననక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ చాలా పకడ్బందీ వ్యూహంతోనే .., అమరావతి విషయాన్ని హైలెట్ చేస్తోంది. రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. రాజధానిపై సాక్షాత్తు సంబంధిత శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినప్పటికీ … ప్రజల్లో ఆశించిన వ్యతిరేకత రాలేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
నాలుగు రాజధానులంటూ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన ప్రకటనతో ఆ ప్రాంతాల్లో కొత్త ఆశలు చిగురించాయి. సరిగ్గా ఇదే అదునుగా త్వరలో ప్రాంతీయ బోర్డ్ లను ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రతిపక్షమైన టీడీపీని ఇరుకున పెట్టే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఒకవేళ రాజధానిపై కోస్తా ప్రాంతంలో గొడవలు జరిగితే మిగతా ప్రాంతాల ప్రజల్లో ఈ పరిణామంపై వ్యతిరేక పవనాలు వీస్తాయని వైసీపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఏర్పడటానికి అసరమైన గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ లోపు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానులు వస్తాయంటూ విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప పేర్లను ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇది అమరావతిపై.. ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోంది.
రాజధాని రైతుల తరపున ఒకవేళ తెలుగుదేశం ఆందోళనకు దిగితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి ఒక్క రాజధాని కోసమే తెలుగుదేశం ఆందోళనకు దిగుతుందని వేలెత్తి చూపేందుకు వైసీపీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ట్రాప్‌లో టీడీపీ పడింది. ఈ మేరకు ఇప్పటికే.. రాజధాని కోసం అండగా ఉంటామని టీడీపీ ప్రకటించింది. వైసీపీ కూడా… అందుకే.. రాజధాని అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీ కూడా రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ప్రకటన చేయటం, ఆ పార్టీ నేతలు సైతం రాజధానిలో పర్యటించటం, సీపీఐ, సీపీఎం నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులతో గళం కలపటం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అమరావతిపై వ్యతిరేకత చూపినా.. మిగతా ప్రాంతాల్లో సానుభూతిని సంపాదించుకోవాలని వైసీపీ వ్యూహకర్తలు ప్రణాళికతో ఉన్నారు.