గతంలో భూములు ఇవ్వని రైతులకు మద్దతుగా అమరావతి పర్యటన చేసిన పవన్ కల్యాణ్ గురువారం… భూములు ఇచ్చిన రైతులకు అండగా పర్యటించబోతున్నారు. మూడ్రోజుల క్రితం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజధాని రైతులు కలిశారు. వారికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. గురువారం అమరావతి వెళ్లబోతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి రాజధాని పర్యటన ప్రారంభిస్తారు. ముందుగా అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా సీఆర్డీఏ భవనాలు చూసుకుంటూ ఉండవల్లిలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుంది. ఏర్పాట్లన్నీ రైతులే చేస్తున్నారు.
రాజధానిలో గతంలో భూ సమీకరణ సందర్భంగా యర్రబాలెం, ఉండవల్లి, తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధాని కోసం భూములివ్వని రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు సేకరించొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులు తమ గోడును వెళ్లబోసుకోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా వారి స్థితిగతులను పరిశీలించటంతోపాటు రాజధానిలో జరిగిన నిర్మాణాలను కూడా దగ్గరుండి పరిశీలించాలని నిర్ణయించారు. పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ రాజధానిపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
పవన్ కల్యాణ్ పై ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీ విమర్శలు ప్రారంభించింది. పవన్ గతంలో ఏమన్నారో.. ఇప్పుడేమంటున్నారో అందరికీ గుర్తేనని.. మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్… కొద్ది రోజుల కిందటే… రాజధానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రాజధాని నిర్మాణాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తీరుపై.. ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.