హైదరాబాద్: ఇటీవల వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో సాధించిన అఖండ విజయాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ పునరావృతం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అంచనాలకు మించి విజయాలను సాధిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థులు సమీప ప్రత్యర్థుల కంటే ఎన్నోరెట్లు అధిక మెజారిటీతో విజయాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే టీఆర్ఎస్ ఒంటరిగానే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేటట్లు కనబడుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇంత మెజారిటీని ఊహించలేదు. గ్రేటర్ ఎన్నికలపై ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కూడా మజ్లిస్‌తో కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటామన్నట్లుగా కేసీఆర్ మాట్లాడారు.
గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం తాలూకు క్రెడిట్ అత్యధికశాతం ఆ పార్టీ కీలక నేత కేటీఆర్‌కే దక్కుతుంది. గ్రేటర్ పోల్ మేనేజిమెంట్ మొత్తాన్ని ఆయన ఒంటి చేత్తో నిర్వహించారు. ఇక మున్సిపల్ శాఖనే కాదు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించటానికి కూడా ఎక్కువ సమయం పట్టేటట్లు లేదు. గెలుపుకు కలిసొచ్చిన మిగిలిన కారణాలను చూస్తే – ఇలాంటి స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి పైచేయి ఎప్పుడూ ఉంటుంది. అధికారం చేతుల్లో ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా తమకనుగుణంగా మలుచుకుంటారు. దానికి తోడు డబుల్ బెడ్ రూమ్ పథకం అనే బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది. ఇకపోతే ప్రతిపక్షాల బలహీనతలు కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చాయి. ప్రతిపక్షాలలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మొదటినుంచి వెనకబడే ఉంది. దానికి తోడు ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఎవరూ లేరు. మరోవైపు టీడీపీ-బీజేపీ కూటమి కూడా మొదటినుంచీ ఆశించదగ్గ పోటీని ఇవ్వలేకపోయింది. ఆ రెండు పార్టీల సీట్ల పంపిణీ ఆఖరి నిమిషం వరకు కూడా సా…గుతూనే ఉంది… వరంగల్ ఉపఎన్నికలోలాగానే. అభ్యర్థుల ఎంపికకూడా లోపభూయిష్టంగానే సాగింది. ఇక చంద్రబాబు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యం చేశారు. నిర్ణయాత్మకమైన ఓటింగ్ కలిగిఉన్న సెటిలర్లు కూడా ఈ ఎన్నికలపట్ల నిర్లిప్తంగా ఉన్నట్లు కనిపించింది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాలలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ ప్రాంతాలలో సెటిలర్లకే టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వటం విశేషం. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ-బీజేపీ కూటమి రెండంకెలకు చేరుకోవటంకూడా అనుమానంగా కనిపిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఇటీవల నిర్వహించిన అయుత మహా చండీయాగం ఆయనకు మంచి ఫలితాలనే ఇస్తున్నట్లుంది.