తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈ సారి బడా పారిశ్రామికవేత్తలకు.. పెద్ద పీట వేయబోతున్నారు. వేల కోట్లకు అధిపతులై… వ్యాపార వ్యవహారాల్లో… బోర్డు మీటింగుల్లో క్షణం తీరిక లేకుండా ఉండే పెద్దలు.. ఈ సారి టీటీడీ బోర్డు సభ్యులుగా మారబోతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం… ఇండియా సిమెంట్ చైర్మన్ శ్రీనివాసవ్, మైహోమ్ గ్రూప్ ఓనర్ జూపల్లి రామేశ్వరరావులతో పాటు మరికొంత మంది పారిశ్రామికవేత్తల పేర్లు ఖరారయ్యాయి.
టీటీడీ బోర్డులో 25మంది సభ్యులు..!
ఎంత ఒత్తిడి వస్తే.. అంత మందికి టీటీడీ బోర్డులో చోటు కల్పించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా ఉంది. అందుకే.. బోర్డులోని సభ్యుల సంఖ్యాను పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా 25 మందితో బోర్డును విస్తరించాలని నిర్ణయించారు. అయితే దీనికి చట్ట సవరణ చేయాల్సి ఉంది. ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి.. ఆర్డినెన్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసిన… ప్రభుత్వం.. గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపనుంది. ఆమోదం రాగానే… బోర్డు సభ్యులను ప్రకటించనున్నారు.
పారిశ్రామికవేత్తలు శ్రీవారి సేవకేనా..?
వేల కోట్లకు అధిపతులైన శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావులు మాత్రమే కాదు… మరికొంత మంది పారిశ్రామికవేత్తల పేర్లు కూడా.. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో ఉండబోతున్నాయి. వీరంతా… క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్లే. అయినా… శ్రీవారి సేవ పేరుతో.. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఎందుకు చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. టీటీడీ బోర్డు ఉన్నది.. భక్తులకు వీలైనంతగా… ఇబ్బందులు కలగకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి. ఇందులో సభ్యులుగా ఉండి పారిశ్రామికవేత్తలు ఎలాంటి… సేవ చేయలేరు. అయినా కానీ.. టీటీడీ బోర్డు చైర్మన్ కన్నా… సభ్యత్వం కోసమే… పోటీ పడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
స్వామి కార్యం.. స్వకార్యం కూడా పారిశ్రామికవేత్తలు ఆశిస్తారా..?
కొన్నా ళ్ల క్రితం.. శేఖర్ రెడ్డి అనే తమిళనాడు కాంట్రాక్టర్ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆ పదవిని అడ్డు పెట్టుకునే.. పలుకుబడి సాధించి… వందల కోట్లు సంపాదించారనే.. ఆరోపణలు వచ్చాయి. శేఖర్ రెడ్డి వ్యవహారం చూసిన తర్వాతే.. టీటీడీ బోర్డు సభ్యుడి పదవి ఎందుకు కోరుకుంటున్నారనే… దానికి కాస్త సమాధానం లభించింది. పారిశ్రామిక వేత్తలు తమ పలుకుబడికి.. దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులను ప్రసన్నం చేసుకోవడానికి… టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ముఖ్యమని వ్యాపారవేత్తలు భావిస్తూండటంతో.. అసలు సమస్య ప్రారంభమైంది. ఈ కోణంలోనే.. ఈ సారి పదవులు భర్తీ చేయబోతున్నారని.. తెలుస్తోంది.