పోలవరం ప్రాజెక్ట్ ఈఎన్సీ మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయనను హఠాత్తుగా ప్రభుత్వం తొలగించింది. ఈ వార్తకు సాక్షి పత్రిక… ఇచ్చిన కవరేజీ.. భిన్నంగా ఉంది. “పోలవరం.. ఇక శరవేగం” శీర్షిక పేరుతో.. కథనం ప్రచురించారు. అందులో… ఈఎన్సీ వెంకటేశ్వరావు ను తీసేస్తున్నట్లుగా వివరించి…ఇక నుంచి పరుగులు పెట్టబోతోందని వివరించుకొచ్చారు. ఇప్పటి వరకూ.. పనులకు ఈఎన్సీనే అడ్డం పడ్డారన్నట్లుగా కథనంలో రాసుకొచ్చారు. గత ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఆయన అక్కడ పాతుకుపోయిన అభిప్రాయాన్ని ఆ కథనంలో కల్పించారు.
నిజానికి ఈఎన్సీ వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ పనులను పదిహేనేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆయన మొదటగా.. పోలవరం ప్రాజెక్ట్ అధికారిగా వెళ్లారు. 2004లో సీఎం అయిన వైఎస్ 2005లో ఇందిరా ప్రాజెక్ట్ పేరుతో పోలవరం పనులను ప్రారంభించారు. ఈ సమయంలో ఈఎన్సీ వెంకటేశ్వరరావు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2010-11లో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు టెండర్లను పిలిచినప్పుడు కూడా ఈఎన్సీ వెంకటేశ్వరరావు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్ 30న పోలవరం సాగు నీటి ప్రాజెక్టు కాంక్రీట్ పనులకు గత ప్రభుత్వం శంకుస్థాపం పనులు చేపట్టే సమయంలోనూ, ఆయనే బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు.. ఆయనను తొలగిస్తూ.. పనులన్నింటికీ అడ్డం పడుతున్నట్లుగా.. సాక్షి కథనం రాయడం.. జలవనరుల శాఖలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ..వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుండే ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావుకు ప్రాధాన్యం తగ్గింది. రివర్స్ టెండరింగ్‌కు సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునే అంశంలో ఈఎన్సీని ప్రభుత్వం పక్కనబెట్టింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ బోర్డులో ఆయన ఈఎన్సీ హోదాలో మెంబర్ కాబట్టి హజరవుతున్నారు. అయితే పీపీఏలో సరైన వాదన వినిపించలేదని ప్రభుత్వం భావించినట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆయనను తొలగించకపోయినా.. మూడు నెలల్లో రిటైర్ అయిపోతారు. కానీ.. ఆయనను తొలగించి.. ఆయన వల్లే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందన్నట్లుగా సాక్షి ప్రచారం చేయడం వల్లే… జలవనరుల శాఖలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.