హిందూ ఆలయాల్లో అన్యమతస్తులంటూ.. తరచూ వస్తున్న వివాదాలకు చెక్ పెట్టాలని ఏపీ సర్కార్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతీ సారి ఏదో వివాదం రావడం.. దాని వెనుక రాజకీయపోరాటం ప్రారంభం కావడంతో… ఏపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారుతోంది. పైగా ముఖ్యమంత్రి… మత విశ్వాసాల నేపధ్యం భిన్నంగా ఉండటంతో.. దీనికి సంబంధించి.. వివాదాస్పదం చేయడానికి పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటే.. ఆలయాల్లోని ఉద్యోగుల మత విశ్వాసాలపై ఓ అంచనాకు రావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ఉద్యోగులకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తోంది.
ఇప్పటికే తిరుమల, శ్రీశైలం లాంటి ఆలయాల్లో అన్యమతస్తులు పెద్ద ఎత్తున ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో తిరుమలలో.. ఓ ఉన్నాతాధికారిణి ప్రతీవారం చర్చికు వెళ్తున్న విషయం బయటపడినప్పుడు కలకలం రేగింది. ఆ సమయంలో.. అన్యమతస్తుల వివరాలను.. అధికారులు బయటకు తీశారు. అయితే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ఇతర ఆలయాలకు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సారి అలా కాకుండా.. పుట్టుకతోనే ఇతర మతస్తులు కాకుండా… మధ్యలో మతం మారిన వారిని కూడా… ఈ జాబితాలో చేర్చి.. పరిశీలన సాగిస్తున్నారు. తిరుమల, శ్రీశైలం. విజయవాడ , అన్నవరం ఇలా ప్రతీ ఆలయంలో.. అన్యమస్తుల వివరాలపై ఆరా తీసి.. ఉద్యోగాల నుంచి తొలగించడమో.. లేకపోతే.. ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే చూడాలని నిర్ణయించారు.
ఈ విషయం ఇప్పటికే ఉద్యోగుల్లో కలకలం రేపడంతో … ఏపీ సీఎస్‌పై … తెలంగాణ మానవహక్కల సంఘంలో ఫిర్యాదు కూడా దాఖలైంది. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ఈ విషయంలో వెనుకడుగు వేయకూడదని.. భావిస్తోంది. ఆలయాల్లో .. అన్యమతస్తులు, అన్యమత ప్రచారం.. అనే అంశాలు ఇకపై హైలెట్ కాకూడదని.. గట్టి ఆదేశాలు.. అధికారులకు వెళ్లాయి. అందుకే.. ఈ సారి అత్యంత కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.