తెలంగాణలో అధికార పార్టీ వర్గాల్లో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చర్చే ప్రముఖంగా వినిపిస్తోంది. విస్తరణ అని అంటున్నారుగానీ, పునర్ వ్యవస్థీకరణ జరగడమే ఖాయమనే సంకేతాలు ఉన్నాయి. అంటే, ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న కొందరిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే కార్యక్రమం కూడా ఉండొచ్చనేది జరుగుతున్న ప్రచారం. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు… మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కీలక సమావేశాల సమాచారాన్ని ఆయన లీక్ చేస్తున్నారనే గుసగుసలు బయటపడ్డాయి. దీంతో ఆయన్ని మారుస్తారనే ఊహగానాలు బలంగా ఉన్నాయి.
విద్యాశాఖ మంత్రిని కూడా మారుస్తారా అనే చర్చ తెరాస వర్గాల్లో ఉంది. ఆయన, విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన జగదీష్ రెడ్డి..! కారణం ఏంటంటే, మంత్రిత్వ శాఖను సమర్థంగా నడపడంలో ఆయన తడబడుతున్నారనే అభిప్రాయం కేసీఆర్ ఉందట. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశం పార్టీకి చెడ్డపేరు తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున తెరమీదికి వచ్చింది. నైతిక బాధ్యత వహించరా అంటూ విపక్షాలూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. పార్టీపరంగా చూసుకున్న సొంత జిల్లాలో తెరాసను బలోపేతం చేయలేకపోతున్నారనే అభిప్రాయమూ ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన్ని మార్చే అవకాశాలున్నట్టుగా తెరాస వర్గాల్లో వినిపిస్తోంది.
మహిళా శిశు సంక్షేమం, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కూడా మార్చొచ్చు అనే అభిప్రాయాలున్నాయి! నిజానికి, ఆయనకి మంత్రి పదవి ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. రంగారెడ్డి నుంచి కీలక నేతలున్నా కూడా వారిని కాదని మల్లారెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే, అప్పగించిన మంత్రిత్వ శాఖల్ని ఆయన సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యారనేది కేసీఆర్ విశ్లేషణగా వినిపిస్తోంది. ఆయన్ని తొలిగించి, ఆ స్థానంలో అదే జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా మార్పు రాకుండా చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తెరాస వర్గాల్లో ఈ ముగ్గురు పేర్లూ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి, కేసీఆర్ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలీదు. ఆయన నిర్ణయాలు అనూహ్యంగా ఉండటం కొత్త కాదు! కాబట్టి, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుందో కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఏదేమైనా, కేటీఆర్ కి బెర్తు ఖాయం. ఇక మిగతా పేర్లు ఏంటనేవి తేలాల్సి ఉంది.