ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు కచ్చితంగా ఆయన పదవి చేపట్టి మూడు నెలలు గడిచింది. అట్ట హాసంగా.. తొలి కేబినెట్ భేటీలో ఎన్నో వరాలు ప్రకటించారు. ఆయన తొలి సారి ముఖ్యమమంత్రి అయ్యారు.. తొలి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కాబట్టి.. అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎంత వేగంగా నెరవేరుస్తారోనని.. ! తొలి నిర్ణయాలు మూడు నెలల కాలంలో ఎంత మేర అమలు చేశారో చూద్దాం..!
- అవినీతిని బయటపెట్టడం : గత ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి.. తొలి కేబినెట్ భేటీలోనే దీనిపై.. ప్రత్యేక కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు.. ఒక్క రూపాయి అవినీతికి సంబంధించిన ఆధారాలను సేకరించలేకపోయింది. కానీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షంగా ఆరోపణలు చేస్తూ… కాలం వెళ్లబుచ్చుతోంది.
- రైతు భరోసా : రైతు భరోసా ద్వారా రూ.12,500 రైతులకు అక్టోబర్ 15వ తేదీన ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఇందులోనూ ఓ యూటర్న్ కనిపించింది. కేంద్రం కిసాన్ సమృద్ధి యోజనద్వారా ఇచ్చే రూ. ఆరు వేలు కాకుండా.. మిగతా రూ. ఆరు వేల 500 మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
- వడ్డీలేని రుణాలు : వ్యవసాయ రుణాలకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించిన సర్కార్ బడ్జెట్లో కేవలం రూ. వంద కోట్లు కేటాయించింది. రైతులు తీసుకునే రుణాల కోసం.. కనీసం.. రూ. 3,500 కోట్ల వడ్డీ బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది.
- సీపీఎస్ రద్దు : సీపీఎస్ రద్దుకు మొదటి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. మూడు నెలలు అయింది. ఓ కమిటీ వేశారు కానీ.. ఇంత వరకూ రిపోర్ట్కు అతీగతీ లేదు.
- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ : కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఓ కమిటీ వేశారు కానీ… ఆ కమిటీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు.
- శానిటేషన్ : అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,000 జీతం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. కానీ ఇప్పుడు.. అలాంటి నిర్ణయమేదీ తీసుకోనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- ఆశా వర్కర్ల వేతనాల పెంపు: ఆశా వర్కర్ల వేతనాన్ని 3 వేల రూపాయల నుండి 10 వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కానీ ఆచరణకు వచ్చే సరికి… గ్రేడ్ల విధానం పెట్టింది. దీంతో ఆశావర్కర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థఇతి వచ్చింది.
- పౌరసరఫరాలు: పేద, మధ్య తరగతి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయం. సెప్టెంబర్ కు 1 నుంచి అమలులోకి తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు సన్నబియ్యం అనలేదని అంటున్నారు. నాణ్యమైన బియ్యంగా ప్రచారం చేస్తున్నారు.
- ఆర్టీసీ విలీనం: ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు.. ఆర్టీసీని విలీనం చేయాలంటే.. కేంద్రం అనుమతి కావాలని.. కొత్త కథ చెబుతున్నారు.
- అగ్రిగోల్డ్ : అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు తక్షణమే 1150 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. నిన్ననే.. ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చానని.. సీఎం జగన్.. ఎప్పుడు.. అగ్రిగోల్డ్ బాధితుల ప్రస్తావన వచ్చినా చెబుతూ వస్తున్నారు.
ఇవి మాత్రమే కాదు… ఇంకా పదుల సంఖ్యలో నిర్ణయాలు తీసుకున్నారు.. అవి రాబోయే కావాలనికి అమలు చేయాల్సినవి. వాటి సంగతి ముందు ముందు తేలనుంది.