ఆవేశంలో రిటైరైన క్రికెట్ ప్లేయర్.. తర్వాత బరిలోకి దిగి సక్సెస్ అయిన స్టోరీతో… జెర్సీ సినిమా వచ్చింది. ఇప్పుడు… ఆ కథనే.. రిపీట్ చేయాలనుకుంటున్నారు… తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. ప్రతిభావంతమైన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతానని… రంగంలోకి వచ్చారు. తాను ప్రకటించిన ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. కానీ అంబటి వ్యవహారశైలి చూసిన వాళ్లు.. ఈ ప్రకటనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే.. అంబటి నిర్ణయాల్లో నిలకడ లేని తనం… అవసరం లేని చోట ఆవేశం… అంతకు మించి క్రికెట్లో అభిమానం పొందాల్సిన పెద్దల వద్ద రిమార్కులు పొందడమే కారణం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. అందులో ఎంత సీరియస్‌గా ఆడి సెంచరీలు కొట్టినా…సెలక్టర్లు పట్టించుకుంటారా.. అన్నది అసలు పాయింట్.
రాయుడు కెరీర్ మొత్తం… ఇలాంటి తప్పుడు నిర్ణయాలతోనే గడిచిపోయింది. . హైదరాబాద్ జట్టుకు ఆడేటప్పుడు.. తనను ఎదగనీయడం లేదని.. ఎప్పుడూ…భావిస్తూ ఉండేవారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో గొడవపడ్డాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా జీ సుభాష్ చంద్ర ప్రారంభించిన ఐసీఎల్ లీగ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో.. బీసీసీఐ బ్యాన్ వేసింది. చివరికి ఆ లీగ్ అట్టర్ ఫ్లాపైన తర్వాత.. ఎలాగోలా.. బీసీసీఐ కరుణించి.. బ్యాన్ ఎత్తేసింది. ఆ తర్వాత కూడా.. మళ్లీ హైదరాబాద్.. బరోడా రంజీ జట్ల మధ్య చక్కర్లు కొట్టారు. బీసీసీఐ రెబల్ సీరిస్‌కు ఎప్పుడైతే రాయుడు వెళ్లాడో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయాడు. కానీ బీసీసీఐ కరుణించడంతో సాధ్యమమయింది. అంతర్జాతీయంగా రాణించగలిగే ప్రతిభ ఉండటంతో.. సచిన్ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ముంబై ఐపీఎల్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్నారు. కానీ అక్కడా అదే తరహా ప్రవర్తన.
అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత లౌక్యంగా.. జట్టులో చోటు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో.. సెలక్టర్లు, సీనియర్లతో… విబేదాలు పెంచుకుని… మొదటికే చేటు తెచ్చుకున్నాడు. ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై గా పెట్టినా చోటివ్వలేదని .. కినుక వహించి.. ఆవేశంలో.. రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు కూడా.. ఏకంగా.. బీసీసీఐ సెలక్షన్ కమిటీపైనే విమర్శలు చేశారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై విమర్శలు చేశాడు. అన్నీ అతనికి మైనస్సే అయ్యాయి. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడానికి రెడీ అయ్యారు. మరి జెర్సీ కథను రాయుడు రిపీట్ చేస్తారా..?