రాజధాని విషయంలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజధానిలో పర్యటిస్తున్న నేతలందరూ.. అన్ని నిర్మాణాలతో పాటు… టీటీడీ తరపున నిర్మిస్తున్న ఆలయాన్ని కూడా చూసి వస్తున్నాయి. అయితే.. అక్కడ కూడా పనులు ఆగిపోవడాన్ని చూసి.. అది మంచిది కాదని చెబుతూ వస్తున్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని కూడా నిలిపి వేశారని… అది రాష్ట్రానికి మంచిది కాదని..సుజనా చౌదరి నేరుగానే హెచ్చరించారు. ఈ క్రమంలో నిజంగానే.. ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని టీటీడీ చైర్మన్ కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బయటకు వచ్చింది. వెంకటాయపాలెం గ్రామంలో రూ. 140 కోట్ల రూపాయలతో, 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయం ఇప్పుడు ఆగిపోయింది.
2019 ఫిబ్రవరి 1వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూకర్ష , భీజవాపనం పూజలకు హాజరయ్యారు. తిరుమల నుంచి సుమారు వంద మంది ఆగమ పండితులు వారం రోజులు అక్కడే ఉండి భూకర్ష పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోనే వెయ్యి కాళ్ల మండపం అంతా శిలాలయంగా శిల్పాశాస్త్ర వేత్తలు ప్లాన్ చేశారు. స్వామి వారి వాహనసేవ జరిగితే… వైభవంగా ఉండేలా ఆలయ మాడవీధులు ఉండేలా ప్లాన్ చేశారు. ఆలయం వెలుపల అన్నప్రసాద భవనం, అతిథి గృహాలు ప్లాన్ చేశారు. ఈ మొత్తాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులను పరిశీలించిన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మౌఖికంగా పనులు ఆపేయమని ఆదేశించారు.
పూర్తిగా ఆపేస్తే.. భక్తుల నుంచి విమర్శళు వస్తాయన్న ఉద్దేశంతో… ఏదో చిన్నది కడదామన్నట్లుగా టీటీడీ చైర్మన్ వైఖరి ఉంది. ఇతర రాష్ట్రాల్లో కట్టే చిన్నపాటి ఆలయాల తరహాలో కట్టాలనే ఆలోచనలో ఉన్నారు. రూ. 36 కోట్లకే మొత్తం ఆలయం పూర్తి అయ్యేలా ప్లాన్ చేయాలని చైర్మన్ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది.