తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై భాజపా నేత డీకే అరుణ ధీటుగా స్పందించారు. ఇంకా చెప్పాలంటే… కేసీఆర్ వాడిన పదజాలానికి ఏమాత్రం తగ్గకుండా మాట్లాడారు. దద్దమ్మ చవటలు సన్నాసులు లాంటి పదాలు ఆయనే విరివిగా వాడేసి విమర్శిస్తుంటారు. అదే స్థాయిలో అరుణ స్పందిస్తూ…. మాట్లాడితే చాలు సన్నాసులు అదీఇదీ అని కేసీఆర్ అంటుంటారనీ, తెలంగాణలో అతిపెద్ద సన్నాసి కేసీఆర్ అని విమర్శించారు. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు ఉమ్మడిగా కృష్ణా, గోదావరి జిలాల్ని వాడుకోవాలనే ప్రతిపాదన చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అరుణ స్పందిస్తూ… గతంలో ఆంధ్రావాళ్ల పట్ల కేసీఆర్ అనుసరించిన తీరును గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
గోదావరి నీళ్లను జూరాలకు ఎప్పటికో తీసుకొస్తానని కేసీఆర్ అంటున్నారనీ, గోదావరి నీళ్లు రావు అనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు డీకే అరుణ. ఆంధ్రా ముఖ్యమంత్రీ నేనూ మాట్లాడుకున్నమని కేసీఆర్ అంటున్నానీ, ఆంధ్రా సీఎంతో ఇప్పుడీయన మాట్లాడితే తప్పులేదుగానీ, డీకే అరుణ అగరొత్తులు పట్టొచ్చిందనీ హారతు పట్టిందీ అని గతంలో విమర్శలు చేసినవ్ కదా కేసీఆర్ ని ఉద్దేశించి అన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో ప్రాజెక్టు ఓపెనింగ్ కి వెళ్తే తనపై నాడు సెంటిమెంట్ మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు ఆయన చేస్తున్న పనేంటని ప్రశ్నించారు? ఈరోజు కొత్త ప్రేమ నీకు ఎక్కడికెల్లి పుట్టుకొచ్చింది, ఆరోజు రాయలసీమ మీద లేని ప్రేమ ఇవాళ్ల ఎందుకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇదంతా సొంత రాజకీయ ప్రయోజనాలకు ఆడుతున్న నాటకమన్నారు. గోదావరి నీళ్లు తెస్తామనే మాటలు కట్టిబెట్టి, ముందు రాష్ట్రంపై దృష్టిపెట్టాలన్నారు. ఇప్పుడు పాలమూరు జిల్లాలోగానీ చుట్టుపక్కల ప్రాజెక్టులుగానీ తన కృషి వల్లనే వచ్చాయనీ, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు సాధించినవని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన పాలమూరు జిల్లాకి ఒరిగిందేం లేదన్నారు.
సెంటిమెంట్ కోణాన్ని కొత్తగా తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు భాజపా నేత డీకే అరుణ. తెలంగాణ ద్రోహులు, ఆంధ్రా నేతలకు తొత్తులూ అంటూ ప్రతిపక్షాల నేతలపై కేసీఆర్ అప్పట్లో తరచూ విమర్శలు చేసేవారు, రాజకీయంగా సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందారనడంలోనూ సందేహం లేదు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కేసీఆర్ మీద విమర్శలకు రివర్స్ లో ప్రయోగించారు అరుణ. రాయలసీమ మీద కొత్త ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. తెరాస నుంచి ఈ అంశంపై కౌంటర్ ఉంటుందా, అనుమానమే!