తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి చేశారంటూ రాష్ట్ర భాజపా ఈ మధ్య తీవ్రంగా ఆరోపిస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ప్రధానంగా చేసుకుని, దీన్లో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అంటున్నారు భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న అవినీతిపై అంశాలవారీగా రాజకీయ పోరాటంతోపాటు, న్యాయ పోరాటాన్ని కూడా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విద్యుత్ శాఖను చూస్తున్నారు కాబట్టి, ఆరోపణలపై జుడీషియల్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని నిరూపించడానికి ఆధారాలతోపాటు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అధికార పార్టీ చేస్తున్న అవినీతి మీద ముందుగా గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు లక్ష్మణ్. ఆయన వెంటనే స్పందిస్తే సరేననీ, లేదంటే వెంటనే కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలిసి తమ దగ్గరున్న ఆధారాలతో ఫిర్యాదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆరోపణలపై న్యాయ విచారణకు ఒక జడ్జిని వేస్తే, వారికీ ఆధారాలు అందిస్తామని చెప్పారు. నార్త్, సౌత్ గ్రిడ్ లను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఎలాంటి విద్యుత్ ఇబ్బందులూ రాకుండా ఉండేలా చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు. అయితే, తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి తాత్కాలిక ఒప్పందాలకు మాత్రమే అనుమతులను కేంద్రం ఇచ్చిందనీ, అయినాసరే కేంద్ర ప్రభుత్వ వైఖరినే కేసీఆర్ తప్పుబడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఇన్నాళ్లూ ఆరోపణలు చేస్తూ వచ్చిన భాజపా, ఇప్పుడు రెండో దశ.. అంటే ఫిర్యాదుల పర్వానికి తెరలేపుతోంది. గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామనీ, ఆయన స్పందించకపోతే కేంద్రానికి వెళ్తామని లక్ష్మణ్ అనడంలోనే… వారి టార్గెట్ నేరుగా కేంద్రాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలనే వ్యూహంలో ఉన్నట్టుగా అర్థమౌతోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అవకతవకలకు సంబంధించి ఆధారాలు తమ దగ్గర బలంగానే ఉన్నాయంటున్నారు! అందుకేనేమో, ముందుగా ఈ అంశంపై పోరాటాన్ని ప్రారంభించారని అనుకోవచ్చు. లక్ష్మణ్ చేస్తున్న తాజా విమర్శలపై కేసీఆర్ ఏమంటారో చూడాలి. ఒకవేళ భాజపా ఫిర్యాదు కేంద్ర హోం శాఖ వరకూ వెళ్తే… తెరాస విషయంలో ఎలాంటి స్పందన ఉంటుందో ఆసక్తికరం అవుతుంది! ఎందుకంటే, కేంద్రంలో భాజపాకి అనుకూలంగానే తెరాస వ్యవహరిస్తున్న ధోరణి ఈ మధ్య చూశాం కదా!