రైతు బంధు పథకం కింద.. రైతులకు చేస్తున్న పెట్టుబడి సాయాన్ని పరిమితం చేసేందుకు.. తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవలి కాలంలో.. ఆర్థిక మాంద్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, వ్యాపార నిపుణులు, విశ్లేషకుల కన్నా… ఎక్కువగా .. తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడుతోంది. ఈ క్రమంలో.. తొలి సారిగా.. మాంద్యం దెబ్బ.. పడబోతోంది.. రైతు బంధు పథకం ద్వారా సాయం పొందుతున్న రైతుల మీదేనని… తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని బయటకు పంపాయి. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది. ఆర్థికంగా సర్దుబాటు చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. దాంతో.. చిన్నగా.. పరిమితులు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
రైతు బంధు పథకాన్ని ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఎకరానికి రూ. నాలుగు వేలు చొప్పున.. ఏడాదికి రూ. ఎనిమిది వేలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నేరుగా రైతులకే ఈ సాయాన్ని అందిస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నదన్నదానితో సంబంధం లేకుండా.. ఎన్ని ఎకరాలు ఉంటే.. అన్ని ఎకరాలకు.. సాయం చేస్తున్నారు. దీంతో.. భూస్వాములకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోందనే విమర్శలు వచ్చాయి. కానీ…కౌలు రైతులను పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అన్నది. ఇప్పుడు మాత్రం.. కేర్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్లో రైతు బంధు పథకానికి సంబంధించి ఇంకా… 40శాతం రైతులకు సాయం అందలేదు. ఇప్పుడు.. రబీ సీజన్ కూడా.. ముంచుకొస్తోంది. ఈ క్రమంలో… కొత్తగా పరిమితులపై దృష్టి సారించింది.
ఇక నుంచి రైతు బంధు పథకాన్ని కేవలం పది ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచనను… తెలంగాణ సర్కార్ చేస్తున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. పది ఎకరాల లెక్కతో రైతులకు .. సమయానికి పెట్టుబడి సాయం అందిస్తే.. పెద్దగా వ్యతిరేకత రాదనే అంచనాకు వస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే.. విపక్షాలకు మరో విమర్శనాస్త్రం అందించినట్లే అవుతుంది.