బ్యాంకింగ్ రంగంలో దక్షిణాది ముద్రను శాశ్వతంగా చెరిపేసే కుట్ర జరిగిందన్న అభిప్రాయం.. దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను కనుమరుగు చేసిన..కేంద్రం కొత్తగా… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆంధ్రా బ్యాంక్, కర్ణాటకకు చెందిన కార్పొరేషన్ బ్యాంక్, విజయ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్.. ఇతర బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. కర్ణాటకలో ప్రధాన కార్యాలయం నుంచి కెనరా బ్యాంక్ ఒక్కటే… కర్ణాటకలో మిగలనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఇంత కాలం బ్యాంకింగ్ రంగంలో ఓ అస్థిత్వంలా… ఉన్న ఆంధ్రా బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇది రాజకీయ పార్టీల్లోనూ కలకలం రేపింది.
23 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై..స్పందించింది. ప్రధాని మోడీకి, నిర్మలాసీతారామన్‌కు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వుందని లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితులలో విలీనం చేయాల్సివస్తే ఆంధ్రాబ్యాంకుగానే నామకరణం చేయాలని.. ప్రధాన కార్యాలయం ఏపీలోనే పెట్టాలని బాలశౌరి డిమాండ్ చేశారు. ఒక్క ఆంధ్రాలోనే కర్ణాటకలోనూ విపక్ష పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది ముద్ర బ్యాంకింగ్ రంగంలో లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల విలీనం వ్యవహారం.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని… కమ్యూనిస్టు పార్టీల నేతలు మండి పడుతున్నారు.
ఉద్యోగులు కూడా విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనలు ప్రారంభించిన ఉద్యోగాలు.. సమ్మె ఆలోచన కూడా చేస్తున్నారు. బ్యాంకుల విలీనం వ్యవహారంపై… ఆర్థిక నిపుణులు ఇప్పటికే అనేక రకాల సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు… ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు కూడా.. భిన్నమైన కోణంలో విమర్శలు ప్రారంభించాయి. వీటిపై… కేంద్రం స్పందించాల్సి ఉంది.