ఆంధ్రా బ్యాంక్.. ఇది తెలుగువారికి ఓ భావోద్వేగ అంశం. మచిలీపట్నంలో పురుడుపోసుకుని.. దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఎదిగిన ఆంధ్రాబ్యాంక్‌ను కనుమరుగు చేయాలని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా బ్యాంక్ కంటే చిన్న బ్యాంకుల అస్థిత్వాన్ని నిలిపి వాటిలో ఇతర బ్యాంకుల్ని కలిపే ప్రయత్నలో ఉన్న కేంద్రం… ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం.. వేరే బ్యాంక్‌లో కలపాలని నిర్ణయించుకుంది. కానీ.., ఒక్కరంటే.. ఒక్కరూ ఆడిగేవారు లేరు. ఆంధ్రుల అస్థిత్వాన్ని విలీనం చేస్తున్నా.. పట్టించుకునేవారు లేరు.
తెలుగు గడ్డపై పురుడుపోసుకున్న మొట్టమొదటి జాతీయ బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్ .1923లో బందరు కేంద్రంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధలు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ బ్యాంకు స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి జాతీయ బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్…భోగరాజు పట్టాభి సీతారామయ్య సామాన్యులకు కూడా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్న సదుద్దేశ్యంతో 1923లో లక్ష రూపాయల పోగుచేసి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా 2వేల 904 శాఖలుగా విస్తరించింది. 21వేల 740మంది సిబ్బందితో సేవలందిస్తుంది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడాన్ని ఆంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పంజాబీయులకు కోపం వస్తుందని… పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ జోలికి వెళ్లలేదు. మహారాష్ట్ర వాసులకు కోపం రాకుండా.. అక్కడ ప్రధాన కార్యాలయం ఉన్న ఏ బ్యాంకునీ కదల్చలేదు. తమిళులతో పెట్టుకోకుండా… ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునీ కదల్చలేదు. కానీ.. అప్పనంగా.. తెలుగువాళ్లే.. ఏ స్పందనలూ లేని ప్రజలుగా.. కేంద్రానికి కనిపించారు. ఆంధ్రా బ్యాంక్‌ను నిస్సంకోచంగా విలీనం చేసేస్తున్నారు. ఇక బ్యాంకింగ్‌లో ఏపీ అస్థిత్వమే ప్రమాదం పడేలా చేస్తున్నారు. ఆంధ్రుకు ఎందులోనూ… ఓ గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నంలో.. మరో గుర్తును చెరిపేస్తున్నారు.
25కి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ … అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. కానీ ఆ ఎంపీ మాత్రం ఓ లేఖ రాశారు. దాదాపుగా 90 శాతం లోక్ సభ సీట్లు ఉండి.. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రజల మనోభావాలను కాపాడలేకపోతే.. ఆ దిశగా కనీసం ప్రయత్నించకపోతే.. ఇంకెవరు ముందుకు వస్తారు..?