గడచిన వారంలో మంత్రి ఈటెల రాజేందర్ చుట్టూనే తెలంగాణ రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన పదవికి గండం తప్పదనీ, సీఎం కేసీఆర్ దృష్టిలో ఆయన నెగెటివ్ అయిపోయారనీ, ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారనీ.. ఇలా చాలా కామెంట్లు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే ఈటెల రాజేందర్ కూడా మూడు రోజుల కిందట హుజూరాబాద్ లో మాట్లాడుతూ… గులాబీ జెండాలకి ఓనర్లమనీ, మంత్రి పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన విషయమే హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. అయితే, ఉన్నట్టుండి ఒకేసారి ఈటెల కూడా మౌనం దాల్చారు, పార్టీలో వర్గాల్లో కూడా ఆయన వ్యాఖ్యల చర్చ అనవసరం అన్నట్టుగా నాయకులు మాట్లాడుతున్నారు.
అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈటెల ఒక్కసారిగా నియోజక వర్గ పనుల్లో బిజీ అయిపోయారు! రోజంతా అభిమానుల సమక్షంలో ఉన్నా కూడా ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యానాలు చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం కుశల ప్రశ్నలు వేసుకుంటూ, నవ్వుతూ పలకరింపులతోనే సరిపెట్టారు. తన నియోజక వర్గ పరిధిలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కానీ, ఎక్కడా ఎవ్వరూ ఈటెల వ్యాఖ్యల ప్రస్థావనే తీసుకురాలేదు. ఆయన్ని అడిగే ప్రయత్నమే చెయ్యలేదు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు, లైబ్రరీ ప్రారంభించారు. ఆ తరువాత, అభిమానులూ నాయకులూ ఆయన్ని కలిస్తే బాగున్నారా అని మాత్రమే పలకరించారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడమన్నా కూడా చిరునవ్వుతో తిరస్కరించారు!
అయితే, ఈటెల వ్యాఖ్యల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది నాయకులతో మాట్లాడినట్టు సమాచారం. ఆయన ఉద్దేశం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మరో మంత్రి దయాకరరావు స్పందిస్తూ… పార్టీ జెండా ఏ ఒక్కరిదీ కాదనీ, అది కేసీఆర్ ది మాత్రమేననీ దాన్ని సృష్టించిందే ఆయన అని అంటూ ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాల్సిందిగా ఈటెలకు బలమైన సంకేతాలు పార్టీ అధినాయకత్వం నుంచి వెళ్లాయని కొంతమంది అంటున్నారు! అదే సమయంలో, ఈటెల వ్యాఖ్యల మీద పార్టీలో ఏ స్థాయిలో కూడా చర్చలు పెట్టొద్దనీ, మీడియా ముందు అస్సలు మాట్లాడొద్దని కూడా మౌఖిక ఆదేశాలు వెళ్లాయనీ తెలుస్తోంది. చర్చకు మాత్రమే పార్టీ ఫుల్ పెడుతోందా, ఈటెలపై చర్యల మీద కూడా ఫుల్ స్టాప్ పెట్టేసిందా అనేది కొద్దిరోజులు ఆగితేగానీ స్పష్టత రాదు!