ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చెందిన హైదరాబాద్ ఇంట్లో… ముఖ్యనేతలంతా భేటీ అయ్యారు. నివాసంలో ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. పార్టీ జాతీయ నేత రాంమాధవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా కీలక నేతలంతా హాజరయ్యారు. రాజకీయాల్లోఎలా బలపడాలన్నదానిపై చర్చించారు. ఏపీ రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ స్పష్టంగా ఉందని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించి నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. పోలవరంపై ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, ఈ అంశంపై రాష్ట్రంలో ప్రజల మనోభావాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ రెండు అంశాల్లో బీజేపీ నుంచి విభిన్న అభిప్రాయం విన్పించొద్దని ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకున్నారు.
కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ సమావేశానికి పలువురు ఆరెస్సెస్ నేతలు హాజరయ్యారు. టీటీడీ బస్ టికెట్లపై జెరూసలెం యాత్ర అంటూ ముద్రించిన టికెట్లను కలిగియుగ దైవం శ్రీవారి భక్తులకు విక్రయించడం, ఇతర మతపరమైన అంశాల్లో కూడా ఏపీలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిపట్ల కొంతమంది బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తప్పనిసరిగా అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడంతోపాటు ఆరెస్సెస్, ధర్మ ప్రచార పరిషత్ తోపాటు ఇతర సంస్థలు కూడా ఈ అంశాలన్నింటిని చాలా సీరియస్ గా తీసుకున్నారని ఆరెస్సెస్ బాధ్యులు ఈ సమావేశంలో వివరించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో దేశంలో నరేంద్రమోడీ, బీజేపీకి ప్రజల మద్ధతు మరింత పెరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో అనేకమంతి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, ఈ అవకాశాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఆరెస్సెస్ కార్యక్రమాల విస్తరణపైనా చర్చ జరిగింది.
సమావేశంలోటీడీపీ అధినేత చంద్రబాబు తీరుపైనా ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుందని కొంతమంది నేతలు ప్రస్తావించారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు.. ఈ అంశాన్ని లేవనెత్తినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇతర నేతలు మాత్రం.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా బీజేపీ నేతలను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబుతో వద్దని వాదించారు. దీంతో ఏపీలో రెండు పార్టీలకు సమదూరం పాటించాలని బీజేపీ విధానపరమైన నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది.