ఏదో ఒక అంశాన్ని చర్చనీయంగా… ఇంకా చెప్పాలంటే వివాదాస్పదంగా ఉంచితే తప్ప పబ్బం గడుపుకోలేని పరిస్థితిలో భాజపా ఇప్పటికీ ఉంది అనేది ఎప్పటికప్పుడు రుజువౌతూనే ఉంటుంది! కాశ్మీరులో రద్దు చేసిన ఆర్టికల్ 370ని తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను రాబట్టుకునేందుకు వాడేస్తున్నారు. రద్దు చేసిన ఘనత మోడీ సర్కారుది అని ప్రచారం చేసుకుని సరిపెట్టుకుంటే తప్పులేదు, కానీ తెలంగాణ కూడా ఆర్టికల్ 370 కిందే ఉండాల్సి వచ్చేదనీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. సంస్థానాల విలీనం కోసం నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు కాబట్టి హైదరాబాద్ విలీనమైందనీ, అదే నెహ్రూ కృషి చేసి ఉంటే ఇక్కడా ఆర్టికల్ 370 తప్పేది కాదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్య వినగానే ఏమనిపిస్తోంది..? నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించాలనే మైండ్ సెట్ భాజపాకి ఎప్పట్నుంచో ఉంది కదా, అది కనిపిస్తోంది. ఇంకోటి… చరిత్ర గురించి ఊహాజనితంగా మాట్లాడటం, వల్లభాయ్ పటేల్ ని భాజపాకి ఓన్ చేసే విధంగా వ్యాఖ్యానించడం, తెలంగాణలో 370 కిందకు రాకుండా పరోక్షంగా తామే కాపాడేశాం అని చెప్పుకోవాలన్న ఆత్రం ఉన్నాయి.
కరీంనగర్లో మాట్లాడిన రాం మాధవ్ మరో వ్యాఖ్య కూడా చేశారండోయ్! దేశ మొత్తాన్ని అభివృద్ధి పథంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడిపిస్తున్నారు అన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు మాత్రం అప్పులవైపు నడుస్తున్నాయన్నారు. అప్పుల విషయంలో పోటీ పడుతున్నాయన్నారు. ఇక్కడి నాయకుల స్వార్థం వల్లనే తెలుగు రాష్ట్రాలకు ఈ దుస్థితి అని వ్యాఖ్యానించారు!
దేశం మొత్తం మోడీ అభివృద్ధి చేస్తుంటే… తెలుగు రాష్ట్రాలే అప్పుల్లో ఉన్నాయంటే, ఇక్కడ అభివృద్ధి గురించి కేంద్రం ఆలోచించడంలేదని ఆయనే పరోక్షంగా చెప్పినట్టు. దేశమంతా బాధ్యత వహిస్తున్న మోడీ… తెలుగు రాష్ట్రాల దగ్గరకి వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు? ఆంధ్రా, తెలంగాణ అప్పుల ఊబిలోకి వెళ్తున్నాయంటే కేంద్రం ఆదుకోవచ్చు కదా. ఆదుకుని తమదే ఘనత అని ప్రచారం చేసుకోండి, ఎవరొద్దన్నారు! రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే కేంద్రం బాధ్యత ఉండదా..? ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? కేవలం భాజపా పాలిత రాష్ట్రాలు, లేదా భాజపాకి మోకరిల్లే రాష్ట్రాల్లో కనిపించే అభివృద్ధినే దేశాభివృద్ధి అని చెబుతారా..? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశాలు పంపుతున్నామనే ఆత్మవిశ్లేషణ వారికి ఉండదేమో అనిపిస్తోంది.