తెలంగాణకు కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళసై సౌందరాజన్‌ను నియమించారు. మొత్తం నాలుగు రాష్ట్రాలకు.. కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్నులు జారీ చేేశారు. కేరళకు ఆర్ఎస్ మహమ్మద్, రాజస్థాన్‌కు కల్ రాజ్ మిశ్రాలను నియమించారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్‌కు మరెక్కడా అవకాశం కల్పించలేదు. తెలంగాణలో గవర్నర్ మార్పుపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే.. తన గవర్నర్ పదవీ కాలం ముగియబోతోందని… గవర్నర్ హింట్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో తాను గవర్నర్ గా ఉన్నా. .. లేకున్నా.. అని ప్రసంగించడంతో.. ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. తమిళసై సౌందరరాజన్… తమిళనాడులో బీజేపీకి సుదీర్ఘంగా కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె… కనిమొళిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కరుగుడుగట్టిన హిందూవాదిగా ప్రకటనలు చేస్తూ ఉంటారు.
ఐదేళ్లు గా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగిన నరసింహన్ ను ఏపీ నుండి తప్పించి తెలంగాణ కు పరిమితం చేశారు. ఇప్పుడు నరసింహన్‌ను… తెలంగాణ నుంచి కూడా తప్పించారు. నరసింహన్ 12 ఏళ్లుగా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో 4ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, విభజన తర్వాత ఐదేళ్లు రెండు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు. ఇంత సుదీర్ఘ కాలం ఒకే చోట ఉండటం రికార్డ్. కాంగ్రెస్ హయాంలో నియమితులైనా …బీజేపీ పాలనలోనూ నిరాటంకంగా కొనసాగారు. చివరికి ఆ రికార్డుకు బ్రేక్ పడింది.
మోడీ రెండోసారి అధికారం చేపట్టాక ప్రత్యేకంగా గవర్నర్ ల నియామకాలపై దృష్టి పెట్టారు. కరుడుగట్టిన సంఘ్ నేతలను ఏరి కోరి నియమిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రత్యేక దృష్టి తో గవర్నర్ లను నియమిస్తున్నారు. ఈ క్రమంలో… బీజేపీ తన వ్యూహాలను తెలంగాణలో అమలు చేయడానికి… తమిళసై సౌందరరాజన్ పక్కాగా సహకరిస్తారని భావిస్తున్నారు. నరసింహన్ సేవలను.. జమ్మూకశ్మీర్‌లో వినియోగించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను.. జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు నేతలు గవర్నర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, కృష్ణంరాజు సహా.. పలువురు సీనియర్లు ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోయింది.