సాహో.. సాహో.. సాహో..
– ఈ పేరే తారక మంత్రంగా సినిమా ప్రపంచం ఊగిపోతోంది.
సినిమా టాక్ ఏంటి? వసూళ్లేంటి? నిజంగా జనంలోకి వెళ్లిందా? హిట్టు లక్షణాలు ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెట్టండి.
ఏదో ఓ రూపంలో సాహో గురించి జనం మాట్లాడుకుంటూనే ఉన్నారు.
సినిమా బాగా లేదని ఓ వర్గం.
బాగుంది – కావాలనే తొక్కేస్తున్నారని ఓ వర్గం.
సినిమా వసూళ్లు ఇరగేస్తోందని ఓ సైడు..
హైపూ, అంకెల గారడీ తప్ప ఇంకేం లేదని ఇంకో సైడూ..
మొత్తానికి సాహో విషయంలో పరిశ్రమ, ప్రేక్షకులు, అభిమానులు రెండుగా విడిపోయారు.
విమర్శకులు మాత్రం ఒకే మాటపై ఉన్నారు. `సాహో ఫ్లాప్` అని తేల్చేశారు.
సోషల్ మీడియా నిండా సాహో ట్రోలింగ్సే.
ఓ సినిమా విడుదలై, మంచి టాక్ వస్తే ట్విట్టర్లూ, ఫేస్ బుక్‌లూ ఊగిపోతాయి. సెలబ్రెటీలంతా `సూపరో సూపర్` అంటూ పోస్టింగులు చేస్తారు. సినిమా బాగుంది చూడండి అంటూ ప్రచారానికి దిగిపోతారు. ఓ సినిమా బాగుంటే మోయాల్సిన బాధ్యత తప్పకుండా సినిమా సెలబ్రెటీలకూ ఉంటుంది. ఎందుకంటే రేప్పొద్దిట వాళ్ల సినిమా వచ్చినా ఇలాంటి స్పందనే కోరుకుంటారు కాబట్టి.. వాళ్ల వైపు నుంచి ప్రమోషన్లు తప్పని సరి.
కానీ సాహో విషయంలో అలాంటిదేం జరగలేదు. స్టార్లు, సెలబ్రెటీలూ, ప్రభాస్ స్నేహితులూ అంతా గప్ చుప్. ఎవ్వరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ప్రభాస్‌ని అజాత శత్రువు అంటారు. అతను అందరికీ డార్లింగే. ప్రభాస్‌పై ఒక్క నెగిటీవ్ మాట కూడా వినం. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అని ప్రభాస్ గురించి చెబుతుంటారు. అలాంటి ప్రభాస్ సినిమా విడుదలైతే, ఎవ్వరూ స్పందించలేకపోవడం ఆశ్చర్యానికే కాదు, అనుమానాలకూ తావిస్తుంది. ప్రభాస్ స్నేహితులు చాలా మంది ఉన్నారు. ప్రభాస్ వెంట ఉంటూ, తన అభ్యున్నతి ఆశించే వర్గానికి లెక్కలేదు. ప్రీ రిలీజ్ పంక్షన్లో చూడండి రాజమౌళి, వినాయక్, శ్యాంప్రసాద్ రెడ్డి.. వీళ్లంతా సాహో ప్రభాస్ అంటూ వేనోళ్ల పొగిడారు. ఈసినిమా హిట్టయితే.. తమ సినిమా హిట్టయినంత పొంగిపోతున్నట్టు మాట్లాడారు. ప్రభాస్‌పై వాళ్లు కురిపించిన అభిమానం అంతా ఇంకా కాదు. అది విని… ప్రభాస్ కూడా కన్నీళ్లు కార్చాడు. ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు. కనీసం జాన్ జిగుర్ దోస్త్‌గా చెప్పుకునే రాజమౌళి సైతం ఈ సినిమా విషయంలో నోరు విప్పలేదే.? ఒక్క ట్విట్టూ చేయలేదే.? వినాయక్ సంగతి సరే సరి. ప్రభాస్ మల్టీప్లెక్స్‌ని ఆవిష్కరించడానికి సూల్లూరుపేట వరకే వెళ్లిన రామ్ చరణ్ సైతం – విడుదలైన తరవాత ఈ సినిమా గురించి నోరు మెదపలేదు. గోపీచంద్, శర్వానంద్ వీరిద్దరూ కూడా `ప్రభాస్ మా బెస్ట్ ఫ్రెండ్` అని చెప్పుకుంటారు. కానీ వాళ్లెక్కడో పత్తా లేదు. బాహుబలి విడుదలైన తరవాత వీళ్లంతా కామ్‌గా ఉన్నారా? పోటీ పడి మరీ పబ్లిసిటీ చేసి పెట్టలేదూ..? మరి ఆ ప్రోత్సాహం ఈ సినిమా విషయంలో ఎందుకు కరువైంది. అంటే సాహో ఫ్లాప్ అని వాళ్లూ ఒప్పుకుంటున్నారా? లేదంటే సాహోతో మరింత ఎదిగిన ప్రభాస్ చరిష్మా చూసి తట్టుకోలేకపోతున్నారా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి..? సెలబ్రెటీల నుంచి ట్వీట్లు చేయించే బాధ్యత పీ.ఆర్ టీమ్ చూసుకుంటుంది. వాళ్లు కాస్త చొరవ చూపితేనే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ పీఆర్ టీమ్ కూడా ఈ విషయంలో నిత్తేజంగా ఉండిపోవడంతో – సెలబ్రెటీ ట్వీట్లూ ఎక్కడా కనిపించలేదు.
యూవీ క్రియేషన్స్ విషయానికొద్దాం. ఈ సంస్థపై ఒక్క నెటిటీవ్ మార్క్ కూడా లేదు. పరిశ్రమలో విక్కీ,ప్రమోద్, వంశీలకు మంచి పేరుంది. వీళ్ల చేతిలో థియేటర్లున్నాయి. వాళ్ల వల్ల ఈ సినిమాకి లేని పోని నెగిటీవ్ రావడం అనేది కల్ల. ఓ విధంగా చెప్పాలంటే యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే యూవీ. ప్రభాస్‌పై లేని నెగిటీవ్.. యూవీపై ఎందుకు ఉంటుంది..? ప్రమోద్, వంశీలు కూడా మిగిలినవాళ్లని కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని, ఈ సినిమాపై మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండడం వల్ల మొదటికే మోసం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాపై కావాలని బురద చల్లుతున్నారన్నది చాలామంది మాట. నెగిటీవ్ రివ్యూల్ని నమ్మవద్దు అని కూడా వాళ్లు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. సాహో బాగానే ఉందని, ఎక్కువగా ఊహించుకుని థియేటర్లకు వెళ్లడం వల్ల ఈ సినిమా ఆనడం లేదని ప్రభాస్ వీరాభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఎక్కువ ప్రచారం చేసిందెవరు? ఎక్కువ చేసి చెప్పింది ఎవరు? సాహో టీమే కదా?
నిజానికి సాహోపై ముందు నుంచీ జనాల్లో అపనమ్మకమే. ఇంత పెద్ద సినిమాని సుజిత్ ఎలా హ్యాండిల్ చేస్తాడా? అని అనుమానించారు. బాహుబలి తరవాత తనమీద పడిన ప్రెజర్‌ని ప్రభాస్ ఎలా తట్టుకుంటారా? అని ఆందోళన వ్యక్తం చేశారు. బాహుబలి తరవాత ప్రభాస్ ఓ సున్నితమైన ప్రేమకథో, ఫ్యామిలీ సబ్జెక్టో ఎంచుకుంటే ఎలాంటి గొడవా ఉండకపోదును. పోయి పోయి.. యాక్షన్ డ్రామాని ఎంచుకున్నాడు. దాన్ని పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో విడుదల చేయాలనుకున్నాడు. అందుకోసం బడ్జెట్ పెంచుకుంటూ పోయాడు. ట్రైలర్ విడుదలయ్యేంత వరకూ ఈ సినిమాపై ఎవ్వరికీ హోప్స్ లేవు. ట్రైలర్ చూశాక.. నిజంగానే ఇది హాలీవుడ్ సినిమాలా ఉంటుందేమో అని కలలు కన్నారు. దానికి తగ్గట్టే అంచనాలు వేసుకున్నారు. చిత్రబృందం కూడా… హడావుడి పెంచేసింది. ఒక్క యాక్షన్ సీన్‌కి వంద కోట్లు ఖర్చయ్యాయని, హాలీవుడ్‌ని మించే యాక్షన్ సీన్లు చూడబోతున్నామని చెప్పుకుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే.. కనివీని ఎరుగని రీతిలో జరిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా.. మాటలు కోటలు దాటాయి. ఈ సినిమా తరవాత సుజిత్ హాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతాడన్నట్టు ప్రభాస్ మాట్లాడం, బాహుబలిని మంచిపోయే సినిమా అవుతుందని కృష్ణంరాజు స్టేట్మెంట్లు ఇవ్వడం – సాహోపై అంచనాలు పెంచేసేలా చేశాయి.
ఇన్ని అంచనాలతో వచ్చినప్పుడు తెరపై అచ్చంగా హాలీవుడ్ సినిమా చూపించినా ఆనదు. సాహో ఇంకేం కనిపిస్తుంది. పైగా నిజంగా ఇదేమైనా కొత్త కథా అంటే అదీ కాదు. అజ్ఞాతవాసి ఏ సినిమాని చూసి వాతలు పెట్టుకున్నాడో.. సాహో కూడా అదే చేశాడు. ట్విస్టులేమైనా బుర్ర తిరిగేలా చేశాయా అంటే అదీ లేదు. అవి ముందే రిలీవ్ అయిపోవడంతో ఆ కిక్కుపోయింది. కేవలం యాక్షన్ సీన్లూ, అందు కోసం పెట్టిన ఖర్చు మాత్రమే కనిపించాయి. అవే సినిమాని గట్టెక్కించాలంటే ఎలా..?
సాహో సినిమాలో మేటరుంది. కానీ 350 కోట్లకు సరితూగే సత్తా లేదన్నది నిజం. ఈ సినిమా మరీ మోసేయాల్సినంత తప్పులేం చేయలేదు. కాకపోతే… అంచనాలు పెంచేసుకుని రావడం సాహో టీమ్ తప్పు. ఇదే సినిమాని వంద కోట్లలో పూర్తి చేసి ఉంటే, మేం హాలీవుడ్ సినిమా తీశాం, అద్భుతాలు సృష్టించబోతున్నాం అని చెప్పకుండా గప్ చుప్‌గా వదిలి ఉంటే.. పాన్ ఇండియా మార్కెట్ అంటూ హడావుడి చేయకుండా కేవలం దక్షిణాదినే టార్గెట్ చేసి ఉంటే – సాహో ఫలితం మరోలా ఉండేదేమో..? ఏదైతేనేం.. ఒక్క సినిమా.. టాలీవుడ్‌కి ఎన్నో పాఠాలు నేర్పింది. హద్దులు దాటి మేఘాల్లో తేలిపోదామని చూసిన తెలుగు సినిమాని నిజంలోకి, జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.