తెలంగాణ గవర్నర్‌గా…తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళసై సౌందరరాజన్‌ను నియమించారు. అమె ఎప్పుడు వచ్చి బాధ్యతలు తీసుకుంటారో.. అప్పుటి నుంచి ప్రస్తుత గవర్నర్ నరసింహన్ మాజీ అవుతారు. నరసింహన్‌కు మరెక్కడా గవర్నర్‌గా అవకాశం కల్పించలేదు. అంటే గవర్నర్‌గా ఆయన సుదీర్ఘ కెరీర్ ముగిసినట్లే. కానీ ఓ పదవి మాత్రం.. ఆయన కోసం ఎదురు చూస్తోంది. అదే తెలంగాణ ప్రభుత్వానికి సలహాలిచ్చే పదవి. వరసింహన్‌కు అటు బ్యూరో క్రాట్‌గా.. ఇటు గవర్నర్‌గా ఉన్న అపార అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు… తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంజరుగుతోంది. నరసింహన్‌ను సలహాదారుగా నియమించుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే.. దీనికి సంబంధించిన ప్రతిపాదన నరసింహన్ వద్దకు వెళ్లిందంటున్నారు.
నరసింహన్‌కు సలహాదారు పదవి ఆఫర్ ఇచ్చిన కేసీఆర్..!
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమించినప్పుడే.. తెలంగాణకూ కొత్త గవర్నర్ వస్తారన్న ప్రచారం జరిగింది. అప్పట్నుంచి.. కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో గవర్నర్ ను కలిశారు. అప్పట్లో… గవర్నర్‌గా పదవిని మారిస్తే… తెలంగాణ సర్కార్ కు సలహదారుగా ఉండాల్సిందిగా.. విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. కొత్త గవర్నర్‌ను నియమించినట్లుగా ప్రకటన వచ్చిన వెంటనే.. కేసీఆర్ రాజ్‌బవన్‌కు వెళ్లారు. నరసింహన్‌తో పర్సనల్‌గా మాట్లాడారు. అప్పుడే.. సలహాదారు పదవిని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ గవర్నర్ స్థానంలో ఉండి.. ఇచ్చిన సలహాల మాదిరిగానే ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది.
నరసింహన్ సలహాలతో కేంద్రంతో దగ్గరి సంబంధాలకు ప్రయత్నించడానికా..?
తెలంగాణ సీఎం కేసీఆర్.. పలువురు కీలక అధికారుల్ని రిటైర్ అయిన వెంటనే సలహాదారులుగా నియమించుకున్నారు. సీఎస్‌గా పని చేసిన రాజీవ్ శర్మ.. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా చేరారు. ఓ రకంగా… ప్రస్తుత సీఎస్ కన్నా.. ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటవుతుందని అంటూంటారు. అదే విధంగా పలువురు సీనియర్ అధికారులు సలహాదారుల పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు… నరసింహన్ ను కూడా ఆ కోటాలో చేర్చాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే నరసింహన్ నుంచి కేసీఆర్ ఏం ఆశిస్తున్నారన్నది కూడా ఆసక్తికరమే. నరసింహన్‌కు… కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు ఆత్మీయ మిత్రుడు. కేంద్రంలో ఎలాంటి నిర్ణయాన్ని అయినా ప్రభావితం చేయగల శక్తి ఉందని నమ్ముతారు. విద్యుత్ ఒప్పందాలపై రగడ.. సీబీఐ విచారణ చేయిస్తామని బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికల నేపధ్యంలో… కేసీఆర్.. నరసింహన్ అవసరం ఉందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో ఇప్పటికే గవర్నర్‌కు ఓ పోస్టు రెడీ అయిందన్న ప్రచారం..!
అయితే నరసింహన్ … అంత ఖాళీగా ఉన్నారా.. అంటే… లేరనే సమాచారం ఢిల్లీ నుంచి వస్తోంది. గవర్నర్ నరసింహన్‌ను… మరో విధంగా ఉపయోగించుకోవడానికే… ఆయనను ప్రస్తుతం గవర్నర్ పదవి నుంచి తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ పై దృష్టి పెట్టంది. అక్కడి పరిస్థితుల్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యత అజిల్ ధోవల్ పైనే ఉంది. అందుకే… అజిల్ ధోవల్ నరసింహన్‌ను.. తన ప్రతినిధిగా.. కశ్మీర్ గవర్నర్‌కు.. సలహాదారుగా ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి నరసింహన్ కూడా అంగీకరించారని.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. కేసీఆర్‌కు.. నరసింహన్ సలహాలు దొరికే అవకాశం లేదు.