వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున… కొత్తగా పెంచిన పెన్షన్లను ప్రారంభించిన కొత్త సర్కార్ … కాస్త వెసులుబాటు ఉంటుంది కాబట్టి… వర్థంతి అయిన సెప్టెంబర్ రెండో తేదీన… వైఎస్ మార్క్ పథకాలను.. కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు రాబోతున్నారని ప్రచారం చేశారు. కానీ.. ఈ వర్థంతి కార్యక్రమాన్ని.. అతి సాదాసీదాగా చేసేస్తున్నారు. ఇడుపులపాయలో… నివాళులర్పించి… ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించి.. మళ్లీ అమరావతి వచ్చేస్తున్నారు జగన్. కానీ.. ముందుగా ప్రకటించిన కీలక కార్యక్రమాల జోలికి వెళ్లడం లేదు.
” రచ్చబండ ” అన్నారు .. సైలెంటయ్యారు..!
వైఎస్ఆర్ వర్థంతి రోజు నుంచి సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని… గతంలో… ప్రభుత్వం నుంచి సమాచారం మీడియాకు అందింది. పదేళ్ల కిందట సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్.. రచ్చబండ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వెళ్తూ.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. అక్కడ ఆయన ప్రారంభించలేకపోయిన పథకాన్ని ఆయన కుమారుడిగా.. జగన్ ప్రారంభిస్తారని.. ఓ ఎమోషనల్ యాత్రలా.. ఆ కార్యక్రమం ఉంటుందన్నారు. కానీ.. అది మొదటగా.. ఆలోచనతోనే ఆగిపోయింది. రచ్చబండ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం లేదు.
” ప్రజాదర్భార్ ” గురించి ఇప్పుడు మాట్లాడటం లేదేం..?
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజుల్లోనే…. ప్రజాదర్భార్ అనే కార్యక్రమం ఆలోచన చేశారు. అప్పట్లో వైఎస్ అలాగే చేశారు. క్యాంఫీసులో రోజూ ఉదయం ప్రజల్ని కలిసేవారు అని.. దాన్ని జగన్ కొనసాగించబోతున్నారని ప్రకటించారు. జూలై ఒకటో తేదీ నుంచే.. అని రెండు రోజుల ముందు ప్రకటించారు. కానీ అప్పటికి వాయిదా వేశారు. ఆగస్టు ఒకటో తేదీకి కూడా ప్రారంభం కాలేదు. అప్పుడు జెరూసలెం యాత్రకు వెళ్లారు. వైఎస్ఆర్ వర్థంతి రోజున… జ్ఞాపకంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. దాదాపుగా… రూ. 90 లక్షల వ్యయంతో.. ప్రజాదర్బార్ కోసం.., ప్రజావేదిక లాంటి నిర్మాణాన్ని.. సీఎం క్యాంపాఫీస్ దగ్గర నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. కానీ ఆ కార్యక్రమం గురించి.. రెండో తేదీ వచ్చినా ప్రభుత్వం మాట్లాడటం లేదు.
రాజన్న క్యాంటీన్ల సంగతేమయింది..?
వైఎస్ఆర్ వర్థంతి రోజు నుంచి పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని చేపడతామని… రాజన్న క్యాంటీన్లను ఆ రోజు నుంచి ప్రారంభిస్తామని.. మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. రూ. ఐదుకే భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసివేసినప్పుడు… పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. అదంతా తాత్కాలికమేనని.. వాటిని తెరవబోతున్నామని.. దానికి వైఎస్ఆర్ వర్థంతినే ముహుర్తమని ప్రకటించారు. కానీ.. రాజన్న క్యాంటీన్లను ఎక్కడా తెరుచుకోలేదు. కనీసం.. వాటిని తెరవాలన్నదానిపై.. ఎలాంటి అధికారిక నిర్ణయమూ తీసుకోనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాజన్న కుమారుడి పాలనలో.. రాజన్న తొలి వర్థంతికి… ఆయనను గుర్తు చేసే ఏ పథకమూ ప్రారంభించడం లేదు. అన్నీ… ప్రచారానికే పరిమితమయ్యాయి.