కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అందరూ కరుడుగట్టిన ఆరెస్సెస్ నేపధ్యమున్న బీజేపీ నేతలే. తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన.. తమిళసై సౌందరరాజన్ అయితే.. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ నియామకాలతో బీజేపీ ఏం సాధించబోతోందనే ప్రశ్న వస్తే.. మొదటగా.. అందరూ చెప్పేది రాజకీయ ప్రయోజనమే. దక్షిణాదిలో తాము పాగా వేయాలని.. అనుకుంటున్న రాష్ట్రాల్లో రాజకీయ గవర్నర్లను నియమించారు. వారితో.. ఇక సాగబోయేది రాజకీయమే కానీ…రాజ్యాంగబద్ధ పాలన కాదు.
గవర్నర్లను యాక్టింగ్ చీఫ్ మినిస్టర్లుగా చేస్తున్న కేంద్రం..!
గవర్నరు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని 1983లోనే అనేక రాష్ర్టాలు సర్కారియా కమిషన్‌ను కోరాయి. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ప్రతిపత్తితో రాష్ట్రాలు ఉన్నప్పుడు గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రణ ఎందుకని రాష్ట్రాలు ప్రశ్నించాయి. మాజీ ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ, క్రియాశీల రాజకీయ నాయకులనూ రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించడం నేరుగా రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయమై 1988లో విలువైన సూచనలు చేసిన సర్కారియా కమిషన్ సమగ్రమైన ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా గవర్నర్ల విషయంలో ఏ రాజకీయ సంబంధంలేని నిపుణులనే గవర్నర్లుగా నియమించాలని చాలా గట్టిగా చెప్పింది. సర్కారియా కమిషన్ మొర విన్న నాథుడు లేడు. కేంద్రం చేతిలో తొత్తులుగా ఉండి.. రాజకీయ అవసరాలు కూడా తీరుస్తూండటంతో.. గవర్నర్లను కేంద్రం తమ ఎజెంట్లుగా రాజ్‌భవన్‌లో కూర్చొబెడుతూనే ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్యానికి బీటలు పడుతూనే ఉన్నాయి.
రాజ్భవన్లు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి బ్రాంచ్ ఆఫీసులా..?
రాష్ట్రానికి రాజ్యాంగాధినేత గవర్నర్. పేపర్ పై పవర్లన్నీ ఆయనకు ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాలన్నీ గవర్నర్ పేరుపైనే వస్తాయి. కానీ వాస్తవంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి అన్ని అధికారాలుంటాయి. ఈ ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. అత్యధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారిని ముఖ్యమంత్రిగా నియమించడం ఆయన విధి. కానీ గవర్నర్లు తమ విధుల్ని.. తమను నియమించిన వారికి అంకితం చేస్తున్నారు. కేంద్రం ఏది చెబితే అది చేస్తున్నారు. రాజకీయ నివేదికల దగ్గర్నుంచి.. అన్ని రకాల వ్యవహారాలను చక్క బెడుతున్నారు. రాజ్‌భవన్ అంటే.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా మార్చేస్తున్నారు. ఇటీవలి కాలంలో గవర్నర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.
ఈ పతనం కాంగ్రెస్‌తో ప్రారంభం.. బీజేపీతో పయనం..!
కాంగ్రెస్ హయాం నుంచే ఈ గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం ఉంది. ఎంత దారుణంగా ఉందంటే… ప్రభుత్వాల ఏర్పాటులోనూ గవర్నర్.. రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కుతున్నాయి. 1952లో మొట్టమొదటిసారి యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులుకు 166 సీట్లతో సంపూర్ణ మెజారిటీ ఉన్నా .. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాలాచారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నరు శ్రీ ప్రకాశి ఆహ్వానించారు. అప్పట్నుంచే గవర్నర్ వ్యవస్థపై చర్చ ప్రారంభమైంది. ఈ పరంపర ఇక్కడితో ఆగలేదు. ఒరిస్సాలో 1973లో నందినీ శత్పథి రాజీనామా చేసిన తర్వాత ప్రగతి పార్టీ నాయకుడు బిజు పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అప్పటి గవర్నర్ అంగీకరించలేదు. 1983-84 మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రామ్ లాల్ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి.. కలకలం రేపారు. ఆ తర్వాత ప్రజల తిరుగుబాటుతో తోక ముడవక తప్పలేదు. అప్పటి నుంచి మొన్న గోవాలోనూ, అరుణాచల్ ప్రదేశ్, మొన్న కర్ణాటకలోనూ అదే వరస. ఇక ముందు జరగబోయేదీ అదే..!