దేశంలో ఆర్థిక సంస్కరణలు అనగానే ఠక్కున గుర్తొచ్చేది మన్మోహన్ సింగ్ పేరే. మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు హాయాంలో ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ చొరవ చూపారు. అప్పటి సరళీకరణ విధానాల వల్లే మన ఎకానమీ ఈరోజున ఈ స్థితిలో ఉందనేది చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేమాట. అయితే, ప్రస్తుతం మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. జీడీపీ 5 శాతానికి పడిపోవడం, ఉత్పాదక రంగం కూడా 0.6 శాతానికి పడిపోవడం ఇవన్నీ సంక్షోభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఒక ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి ఇలా మారిందని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, పన్నుల పెంపు వంటి నిర్ణయాల ప్రభావం నుంచి దేశం ఇంకా బయటపడలేదనడానికి ప్రస్తుత పరిస్థితే సాక్ష్యమన్నారు.
మన్మోహన్ వ్యాఖ్యలపై భాజపా ఎటాక్ ప్రారంభించింది! దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అనగానే మన్మోహన్ కాదు, మోడీ మాత్రమే గుర్తురావాలనే ప్రచారానికి తెర తీసినట్టుగా కనిపిస్తోంది. నెహ్రూని తగ్గించి, పటేల్ ప్రాధాన్యత పెంచే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇది కూడా అదే తరహా ప్రచారాంశంగా మారుస్తున్నారు. మన్మోహన్ వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ… మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్తేగానీ, ఆయన్ని అడ్డం పెట్టుకుని చాలామంది చాలా అవినీతి చేశారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లేలా చేశారన్నారు. మోడీ హయాంలో మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు పడ్డాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంవైపు వెళ్తుంటే… మనదేశంలో పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.
కాంగ్రెస్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పడం ఆయన ఉద్దేశం. మోడీ హయాంలో మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధించామని చెప్పడం వారి లక్ష్యం. నిజానికి, మోడీ హయాంలో పడ్డ ఆ పునాదులేంటో భాజపా నేతలు వివరిస్తే బాగుంటుంది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పన్నుల ప్రభావం సామాన్యుడిపై తీవ్రంగా పడింది. అయితే, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో భాగంగా ఆ అంశాన్ని ఎన్నికల్లో చర్చనీయం కాకుండా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై దాడుల అంశాన్ని ప్రముఖం చేసి చర్చని దేశభక్తి వైపు మళ్లించారు. ఇప్పుడు కూడా, జీడీపీ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంటే… ఇది కాంగ్రెస్ హయాంలో మొదలైన పతనమన్నట్టుగా మొదలుపెట్టారు! గడచిన ఐదేళ్లూ భాజపా పరిపాలనలోనే దేశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలే అవుతాయి. ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయన్న ఇమేజ్ ని ఎలా చెరిపేయాలనే ఉద్దేశంతో భాజపా వ్యవహరించడం శోచనీయం.