కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయింది. ఎన్నికల్లో అసలేం జరిగిందో అన్నదానిపై టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు వస్తున్నారు. బీజేపీ, జనసేనలకు దూరం అవడం వల్లే ఘోరపరాజయం పాలయినట్లుగా.. టీడీపీ నేతలు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. భారతీయ జనతా పార్టీతో కటిఫ్ చెప్పవద్దని.. టీడీపీ అధినాయకత్వానికి చెప్పినా వినిపించుకోలేదని… బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి పలుమార్లు … మీడియా ఇంటర్యూల్లో చెప్పుకొచ్చారు. మరికొంత మంది నేతలదీ అదే మాట.
బీజేపీతో విడిపోవడం వల్లే నష్టపోయామని టీడీపీ నేతల భావన..!
మెరుగైన పాలన అంందించామన్న నమ్మకం.. ఎన్నడూ లేనంతగా సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చామన్న ధీమాతో….. సామాజిక సమీకరణాలు లెక్కలు.. ఇంత అంశాలను లెక్కలోకి తీసుకోకుండా.. తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనలను దూరం చేసుకుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో గట్టిగానే వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీనే విలన్‌గా చూపించి ఎన్నికల బరిలోకి దిగింది. చివరిలో జనసేన పార్టీని దగ్గర తీసుకోవాలని… చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే.. సమయం మించిపోయింది. పవన్ కల్యాణ్‌కు.. ఆరు శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ సంప్రదాయ ఓటర్లు కూడా.. ఆ పార్టీకి వేయకుండా.. బీజేపీని విలన్ ప్రొజెక్ట్ చేసిన టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి వేశారు. బీజేపీ నేతలు కూడా పలుమార్లు ఇదే విషయాన్ని ప్రకటించారు. వైసీపీకి వచ్చిన ఓట్లలో..బీజేపీ ఓట్లు ఇరవై శాతం ఉంటాయని నేరుగానే ప్రకటించారు.
టీడీపీ అధినేతకూ అదే అనిపిస్తోందా..?
ఫలితాల తర్వాత టీడీపీ నేతలకు వాస్తవం అర్థం అయింది. అభివృద్ధి చేయడం అధికార పార్టీ బాధ్యతే కానీ.. దాన్నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం అత్యాశే అవుతుందన్న అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే.. వారు చేసుకుంటున్న విశ్లేషణల్లో.. ఇతర వర్గాలను దగ్గర తీసుకోవాలంటే… కొంత సడలింపు తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు బీజేపీని వదులుకోవడం వల్లే నష్టపోయామనే ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత కూడా ఈ విషయంలో… తప్పుడు నిర్ణయం తీసుకున్నామన్న అభిప్రాయానికి వచ్చి ఉంటారని.. ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీజేపీకి వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినప్పటికీ… ప్రజలు ఏ మాత్రం.. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయలేదని… కొంత మంది గుర్తు చేస్తున్నారు.
గతంలో తలుపులు తెరిచేది లేదన్న అమిత్ షా… మళ్లీ ఆలోచిస్తారా..?
ఈ పరిణామాల వల్లే తెలుగుదేశం పార్టీ మళ్లీ బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని కన్నా లక్ష్మినారాయణ నివాసంలో జరిగిన ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. …ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా.. మళ్లీ.. చంద్రబాబునాయడు ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారని.. కానీ తాము తలుపులు మూసేశామని ప్రకటించారు. ఇప్పుడు.. టీడీపీ నేతలు…మాత్రం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు.