సుదీర్ఘ కాలం గవర్నర్ గా విధులు నిర్వహించి నర్సింహన్ భావోద్వేగాలకు లోనయ్యారు. తొమ్మిదేళ్లపాటు తనకు సహరించిన మీడియాకి ధన్యవాదాలు చెప్పారు. పెద్దలూ దేవుళ్లూ అంటే తనకు గౌరమనీ, ఆలయాలకు తాను తరుచూ వెళ్తుంటాననీ, దీనిపై కొంతమంది చేసిన విమర్శలు తనని బాధించాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తాను తెలంగాణకు వ్యతిరేకమంటూ ప్రచారం జరిగిందన్నారు. విభజన సమయంలో అన్ని పార్టీలూ సమన్వయంతో వ్యవహరించాయన్నారు. ఇక్కడి నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్తున్నానని నర్సింహన్ చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రాకి, విభజన తరువాత తెలంగాణ, ఆంధ్రాకి గవర్నర్ గా, తెలంగాణకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు నర్సింహన్. ఆయన సమయంలోనే రాష్ట్ర విభజన అనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ తరువాత, విభజన చట్టం వచ్చింది. రెండు రాష్ట్రాలూ ఏర్పడ్డ తరువాత ఆయన ఎక్కువగా తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారనే భావనే ఏర్పడేలా వ్యవహరించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా, పాలన అంతా ఏపీకి తరలిపోయాక… ఆయన ఏపీకి తరుచూ వచ్చిందే లేదు. క్యాంపు కార్యాలయాల నుంచి రాష్ట్ర పాలన సాగుతుంటే, ఆంధ్రాకి వచ్చి ఆయన బస చేసిన సందర్భాలూ చాలా తక్కువే.
విభజన చట్టం అమలు విషయంలో కూడా ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా ఆయన చూపిన చొరవా ఏమంత కనిపించదు. రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు చాలానే ఉన్నాయి. వాటి విషయంలో గవర్నర్ కల్పించుకుంటే ఈపాటికి అన్నీ ఒక కొలీక్కి వచ్చేవి. ఆ ప్రయత్నమే ఆయన చేసినట్టు కనిపించదు. సరే, చట్టంలో అంశాలు వదిలేద్దాం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఆదాయ మార్గాలు లేవు. నిలదొక్కుకునే వరకూ అండగా నివాల్సిన కేంద్రం కూడా సాయం అందించని పరిస్థితి. ఇన్ని సమస్యలు అనునిత్యం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు, వీటి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో గవర్నర్ చూపిన చొరవ అంటూ ఏదైనా ఉందా అని ప్రశ్నించుకుంటే… జవాబు కనిపించని పరిస్థితి. గవర్నర్ కి ఉన్న అధికారాలు పరిమితమైనవే కావొచ్చు. కానీ, రాష్ట్ర పరిస్థితిని కేంద్రానికి అర్థమయ్యేరీతిలో చెప్పడంలో ఆయన చొరవ అంటూ ఉండాలి కదా. కేంద్రానికి ఆయన ఇచ్చే నివేదికలు కూడా ఎక్కువగా రాజకీయ కోణం నుంచి ఉన్నవే అనే అభిప్రాయమే ఎప్పుడూ కలుగుతూ వచ్చిందిగానీ, రాష్ట్ర సమస్యలపై ఆయన స్పందించారనే అభిప్రాయాన్ని ఆయన కలిగించలేకపోయారనేది వాస్తవం.