కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ.. జైళ్లకు పోతున్నారు. ఒకరి తర్వాత ఒకర్ని.. సీబీఐ, ఐటీ, ఈడీ వేటాడి.. వెంటాడి.. జైళ్లకు పంపుతోంది. తమపై కనీస సాక్ష్యాధారాలు లేవని.. వారు మొత్తుకున్నా… దర్యాప్తు సంస్థలు వినిపించుకోవడం లేదు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసి.. కస్టడీల మీద కస్టడీలకు తిప్పుతూ ఉంది. బెయిల్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ లోపే… ఆర్థిక మాంద్యం భారత్‌ను గట్టిగా తాకిందని.. ఐదు శాతం లోపే జీడీపీ వృద్ధి ఉందని తేలింది. దానిపై స్పందించడానికి కాంగ్రెస్ కు వాయిస్ లేకుండా పోయింది. మన్మోహన్ ఒక్క ప్రకటన ఇచ్చినా.. బీజేపీ కౌంటర్లకు ధీటుగా బదులిచ్చే వాయిస్ కరవైంది.
ఇప్పుడు కర్ణాటకలో… ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అరెస్ట్‌తో మరో కీలక నేత జైలుకెళ్లాల్సి వచ్చింది. డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. నాలుగు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నిస్తోన్న ఈడీ.. విచారణకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకే.. ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసులిచ్చారని.. డీకే శివకుమార్ ముందుగానే ఊహించారు. ఏడాదిన్నర క్రితం.. ఆయన ఇంట్లో.. సోదాలు జరిగినప్పుడు.. రూ. కోటి పట్టుబడ్డాయని.. ఐటీ అధికారులు ప్రకటించారు. అప్పట్నుంచి శివకుమార్ పై అనేక సార్లు ఐటీ దాడులు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై కేసు నమోదైంది.
డీకే శివకుమార్‌ను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఆయన్న కస్టడీకి కోరే అవకాశం ఉంది. డీకే శివకుమార్ అరెస్ట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇది రాజకీయ కక్షేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్‌లో డీకే శివకుమార్ కీలక నేత. ముఖ్యంగా ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరుంది. కర్నాటకలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అయితే కర్నాటకలో సంకీర్ణ సర్కార్ కూలడం.. ఆ వెంటనే ఈడీ నోటీసులు రావడం.. ఇప్పుడు అరెస్ట్ అన్ని చకచకా సాగిపోయాయి. ఇప్పుడు బీజేపీ సర్కార్ కర్ణాటకలో కొలువు దీరింది. ఆ సర్కార్ లోనూ లుకలుకలున్నాయి. డీకే బయట ఉంటే.. ప్రభుత్వం పతనం అవుతుందన్న భయంతో.. జైలుకు పంపినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా.. వివిధ కేసుల్లో… వారెంట్లు అందుకుంటున్నారు. త్వరలో రాహుల్‌ను కూడా జైలుకు పంపినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.