గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్న అక్రమమైనింగ్ కేసు చాలా తీవ్రమైనదని.. దీనిపై సీబీఐ విచారణ చేయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని… ఏపీ సర్కార్ లాయర్ హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే.. సీబీఐని ఏపీలో కేసులు చేపట్టేందుకు అవసరమైన జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించినందున.. హైకోర్టుకు చెప్పినట్లుగా… విచారణ చేయాలని.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో తొలి సీబీఐ కేసు అవుతుంది. గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. దాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వతా వైసీపీ నేతలు దీనిపై మరో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు .. అధికారులపై సీరియస్ అయింది. దీనిపై గతంలో విచారణ జరిపిన ప్రభుత్వ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కానీ వారు కూలీలని ..అసలు వ్యక్తుల్ని వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి.
వైసీపీ హిట్ లిస్ట్‌లో .. యరపతినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యరపతినేనిపై సీబీఐ విచారణకు.. వచ్చిన అవకాశాన్ని ఏపీ సర్కార్ వదులుకునే అవకాశం లేదని.. రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ.. ప్రస్తుతం.. సీబీఐ చాలా కేసుల్లో బిజీగా ఉంది. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటుందా.. లేదా అన్నదానిపై.. ప్రభుత్వంలోనే కొంత సందేహం ఉంది. పైగా… వైసీపీతో బీజేపీ.. దూర దూరంగా వ్యవహరిస్తోంది. మళ్లీ టీడీపీ.. బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో.. సీబీఐకి ఇస్తే.. తాము అనుకున్నట్లుగా జరుగుతుందా.. లేదా అన్న సందేహం ప్రభుత్వంలో ఉంది. కానీ హైకోర్టుకు చెప్పినందున.. సీబీఐ విచారణ కోరుతూ.. కేంద్రానికి లేఖ రాయడమే సాంకేతికంగా మిగిలిందనే భావన వ్యక్తమవుతోంది.