జీవిత చరిత్రల్ని సినిమాలుగా తీసేటప్పుడు ఎంతో కొంత పాలీష్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా తీయడానికి దర్శకులు కాస్త వెనకా ముందూ ఆలోచిస్తారు. తెలుగులో అయితే బయోపిక్లన్నీ స్వచ్ఛంగానే ఉంటాయి. నెగిటీవ్ కోణాల్ని టచ్ చేసే సాహసం చేయరు. `మహానటి`లో సావిత్రి చీకటి కోణాల్ని చూపించలేనందుకు కొన్ని విమర్శలు వినిపించాయి. `ఎన్టీఆర్` బయోపిక్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు `సైరా`కూడా అదే ఫాలో అవుతున్నాడనిపిస్తోంది.
ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథని `సైరా`గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథని సినిమాగా తీయాలని చిరు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే.. బడ్జెట్ పరిమితుల వల్ల ఆ సాహసం చేయలేదు. `బాహుబలి` ఇచ్చిన స్ఫూర్తిగా, ఆ స్కేల్లోనే `సైరా`ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తొట్టతొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రకెక్కాడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటు జరగడానికి ఉయ్యాల వాడ ఇచ్చిన స్ఫూర్తే కారణం. అక్కడి నుంచే స్వాతంత్య్ర సమరం ప్రారంభం అయ్యింది.
అయితే ఉయ్యాలవాడ అందరిలా దేశ భక్తుడు కాదు. తను కూడా తొలినాళ్లలో బ్రిటీషు వారికి తొత్తుగానే ఉండేవాడు. బ్రిటీష్ వారిపై తన విధేయతని ప్రదర్శిస్తుండేవాడు. ఒకొనొక సందర్భంగా కొత్తగా వచ్చిన బ్రిటీష్ కలెక్టర్కీ, ఉయ్యాల వాడకూ మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. అది చినికి చినికి గాలివానగా మారుతుంది. పంతానికి పోయిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి తను బ్రిటీష్ వారికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని, తన ఇలాఖాలో బ్రిటీష్ సైన్యం అడుగు పెట్టకూడదని శాశిస్తాడు. అక్కడి నుంచి బ్రిటీష్ వారికీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికీ వైరం మొదలవుతుంది. తన ప్రాంతంపై ప్రేమ, బ్రిటీష్ వారిపై పంతం తప్ప, దేశంపై భక్తి ఏమాత్రం లేని, ఓ మొండి రాజు.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి. కాకపోతే ఇలా చూపిస్తే.. జనం చూడరు. అందుకే ఉయ్యాల వాడని పరమ దేశభక్తుడిగా చిత్రించే అవకాశం ఉంది.
పైగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి స్త్రీలోలుడని అప్పట్లో ప్రచారం జరిగింది. తనకు చాలామంది భార్యలు ఉండేవార్ట. ఈ విషయాల్ని తెరపై చూపించే సాహసం చేసే అవకాశమే లేదు. చరిత్రని కాస్త మెరుగులు దిద్ది, సినిమాటిక్ సన్నివేశాల్ని జోడించి `సైరా`ని తీసే ఛాన్సుంది. అయితే.. ఉయ్యాలవాడ చరిత్ర తెలిసినవాళ్లు, ఆ వంశస్థులు దీన్ని అంగీకరిస్తారా? అసలు `సైరా`లో ఉన్నదేమిటి? ఈ విషయాలు తెలియాలంటే అక్టోబరు 2 వరకూ ఆగాలి.