ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పరస్థితి ఘోరంగా మారింది. ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే.. ప్రతిపక్షానికి టార్గెట్ అవుతున్నారు. టీడీపీ హయంలో.. వైసీపీ నేతలు.. పోలీసులపై ఓ రేంజ్ లో ఫైరయ్యేవారు. అసలు పోలీసులపై నమ్మకం లేదని.. తెలంగాణ పోలీసులపై ఆధారపడేవారు. ఓ రకంగా.. పోలీసులంటే.. టీడీపీ నేతలన్నట్లుగానే వైసీపీ నేతలు భావించేవారు. వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి నుంచే ఆ తరహా ప్రవర్తనను వైసీపీ నేతలు అలవర్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారపక్షంలోకి వచ్చింది. ఇక పోలీసుల్ని నమ్మకపోవడానికి అవకాశం లేదు. కానీ.. ఇప్పుడు.. వైసీపీ ప్లేస్ లోకి టీడీపీ వచ్చింది. వారు.. పోలీసులపై విరుచుకు పడుతున్నారు.
పోలీసులు జాగ్రత్తగా…న్యాయంగా వ్యవహరించండని.. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో ఓపెన్ గానే హెచ్చరిక జారీ చేశారు. మూడేళ్ళలో ఎన్నికలు రాబోతున్నాయని .. మీరు మళ్ళీ మా దగ్గరే పని చేయాల్సి ఉందని…వార్నింగ్ గట్టిగానే పంపారు. హెల్మెట్లు లేవని ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని.. అయ్యన్న ఇలా ఫైరయ్యారు. తప్పు పోలీసులది కాదు ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి ఉందని తర్వాత కవర్ చేసుకున్నారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా… పోలీసులు స్పందించడం లేదని… పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తానని హెచ్చరిస్తున్నారు.
పోలీసులకు సొంత రాజకీయ అభిప్రాయాలు ఉన్నా.. ప్రభుత్వం చెప్పినట్లు చేయాల్సిందే. అలా చేసినందుకు..పలువురు పోలీసు అధికారులపై… వైసీపీ సర్కార్ రాగానే ప్రతీకారం తీర్చుకుంది. పలువురికి పోస్టింగులు నిరాకరించింది. అప్పట్లో వైసీపీ ఆగ్రహానికి చాలా మంది అధికారులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ప్రభుత్వాలు మారితే ముందుగా.. పోలీసులకే టెన్షన్ పట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది.