ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని చెప్పడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..
అన్నం సతీశ్ మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఈ మధ్యనే బీజేపీలో చేరారు. పైగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన మాట్లాడుతూ, జనసేన త్వరలోనే బిజెపిలోకి విలీనం అవుతుందని, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉంటారని, పవన్ కళ్యాణ్ ని విలీనం కి ఒప్పించడానికి ఢిల్లీ నుండి బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారని, ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్లోగా పూర్తవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తానా సభల సందర్భంగా పవన్ కళ్యాణ్ రామ్ మాధవ్ తో భేటీ కావడం, ఇటీవల పవన్ కళ్యాణ్ మోడీ పై ప్రశంసల జల్లు కురిపించడం, ఇందుకు సంకేతాలని అంటూ సతీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ బలం పెరుగుతుందని, బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే ఇద్దరికీ ప్రయోజనం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే జనసేన అభిమానులు మాత్రం, జనసేన పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పినా కూడా కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. పైగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ చేసిన అన్నం సతీష్ లాంటి వాళ్లు తెలుగుదేశం పార్టీ తరపున బీజేపీ లోకి కోవర్ట్ గా వెళ్లి ఉండవచ్చని, తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చని సోషల్ మీడియాలో జనసైనికులు విరుచుకు పడుతున్నారు.
జనసేన పార్టీ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.