బతుకమ్మ పండుగ వస్తోందంటే చాలు… తెరాసలో హడావుడి మొదలౌతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ జాగృతి సంస్థ పేరిట ఉత్సవాలకు సిద్ధమౌతారు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. తెలంగాణ సంస్కృతిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆ తరువాత కూడా అదే సంప్రదాయాన్ని అధికార పార్టీ తెరాస పాటిస్తూ, ఘనంగా ప్రతీయేటా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇతర పార్టీలు కూడా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించినా కూడా… తెరాస స్థాయిలో ఎవ్వరూ నిర్వహించలేకపోయారు. అయితే, ఈ సంవత్సరం కొత్తగా భారతీయ జనతా పార్టీ బతుకమ్మ పండుగకు సిద్ధమౌతోంది!
మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భాజపా కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. దీన్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో తెలంగాణ విమోచన దినం కూడా ఉంది. తెరాసను ఇరుకున పెట్టాలంటే విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీనేతలు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంగానే దీన్ని ప్రొజెక్ట్ చేయాలని నేతలు నిర్ణయించారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరపాలని కూడా ఈ సమావేశంలోనే పార్టీ నిర్ణయం తీసుకుంది. మొదటి రోజున గోల్కొండలో భారీ ఎత్తున ఉత్సవాలు జరపాలనీ, ఆ తరువాత ప్రాంతాల వారీగా పండుగను నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ఉత్సవాలకు కేంద్రం నుంచి జాతీయ నేతలు అతిథులుగా రప్పించాలని నిర్ణయించారు. ఒక్కో రోజున ఒక్కో చోట జరిగే ఉత్సవాల్లో భాగంగా కేంద్రం నుంచి మహిళా మంత్రుల్ని ఒక్కొక్కరిగా రాష్ట్రానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు.
ఈసారి భాజపా బతుకమ్మ ఉత్సవాల హడావుడి తెలంగాణలో బాగానే ఉండబోతోంది. పార్టీ విస్తరణే ధ్యేయంగా, దాన్లో భాగంగా ఈ ఉత్సవాలను కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇంకోపక్క, తెరాస కూడా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు యథావిధిగా చేస్తోంది. విదేశాల్లో కూడా తెలంగాణ జాగృతి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది యూకేలో నిర్వహించబోయే ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం నాడు కవిత ఆవిష్కరించారు. విదేశాల సంగతి ఎలా ఉన్నా… రాష్ట్రంలో తెరాస వెర్సెస్ భాజపా అనేట్టుగా పరిస్థితి ఉండబోతోందని అనిపిస్తోంది.