ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోతోంది. రోజు రోజుకు.. పరిస్థితి దిగజారిపోతోంది. మూడు నెలల క్రితం ఉన్నంత ఆదాయం ఉన్నా.. ఈ పరిస్థితి ఉండేది కాదు. అనూహ్యంగా ఆదాయం పడిపోవడం.. కొత్త ప్రభుత్వం వివిధ రూపాల్లో.. నెలవారీ ఖర్చులు పెంచడంతో అసలు సమస్య వచ్చింది. ప్రస్తుతం.. జీతాలు, పెన్షన్లు తప్ప.. మరేలాంటి బిల్లులు కూడా.. చెల్లించవద్దని.. అన్ని జిల్లాల పే అండ్ ఎకౌంట్స్ కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు.. ట్రెజరీల్లో.. బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. ట్రెజరీల్లో క్లియర్ చేయాల్సిన బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉండిపోయాయి. చివరికి.. ప్రభుత్వ విభాగాలకు.. సేవలు అందించే క్యాబ్ డ్రైవర్లకు కూడా.. బిల్లులు చెల్లించడం లేదు. దీంతో.. క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు కూడా.. ఇబ్బంది పడుతున్నారు.
సాధారణం… ఆర్థిక సంవత్సరం చివరిలో.. అంటే.. జనవరి-ఫిబ్రవరిలో ప్రభుత్వాలు.. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఎందుకంటే.. ఏడాది అంతా.. పెండింగ్ పెట్టిన బిల్లులు… అప్పుడు ఖచ్చితంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ ఆర్థిక సంక్షోభం ముందుగానే వచ్చింది. గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిన బిల్లులతో పాటు.. కొత్త ప్రభుత్వం ఖర్చులు కూడా… ఇప్పుడు భారంగా మారాయి. అదే సమయంలో.. ఆదాయం పడిపోయింది. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. నెలవారీగా రూ. మూడు వేల కోట్లు అప్పు తీసుకున్నా.. జీతాలు, పెన్షన్లకు మాత్రమే.. సరిపోతోంది. ఇతర బిల్లులకు నిధులు సరిపోవడం లేదు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందన్నదానిపై పెద్దగా క్లారిటీ లేదు. మద్యం షాపులను నియంత్రిస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి.. పరిమితంగానే మద్యం విక్రయించబోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఆదాయంపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఇసుక అమ్మకాలు.. అదీ టన్నుకు రూ. 375 వసూలు చేసి ప్రారంభించబోతున్నారు కాబట్టి… ఎంతో కొంత ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ఇవన్నీ .. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సరిపోవన్న భావన ఏర్పడుతోంది. ఈ నెల నుంచి నవరత్నాలను అమలు చేయాల్సి ఉంది. దీంతో ఆర్థిక శాఖ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది.