అభివృద్ధిని అడ్డుకుంటున్నారు… ఇదే విమర్శని ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు తెరాస, భాజపా నేతలు. రాష్ట్రాన్ని ముందుకు కదలనీయకుండా కేంద్రం అడ్డుకుంటోందనీ తెరాస అంటుంటే, రాష్ట్రంలో తాము చేద్దామనుకుంటున్న అభివృద్ధిని ఇక్కడి అధికార పార్టీ అడ్డుకుంటోందని భాజపా అంటోంది. ఇదే అంశంపై రెండు వేర్వేరు సందర్భాల్లో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు.
హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయమూ అందడం లేదనీ, ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించే ఉద్దేశం వారికి లేదని విమర్శించారు. జిల్లాలు, పట్టణాలు అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని స్కైవే నిర్మాణాలు తలపెట్టామనీ, దీని కోసం రక్షణ శాఖకు చెందిన కొన్ని స్థలాలు అవసరమైతే ఇవ్వాలని కేంద్రం మూడేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రక్షణ శాఖ ఆసుపత్రి వంద పడకలుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ సందర్భాల్లో కేంద్రాన్ని ఎన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు కేటీఆర్.
లక్ష్మణ్ ఏమంటారంటే… రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలున్నారనీ, ఎమ్మెల్యేలున్నారనీ, పంచాయతీ సర్పంచ్ లున్నారనీ, వీరి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్నీ నిలిచిపోయాయన్నారు. భాజపా నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారనీ, ఏ పనులూ ముందుకు సాగనీయండం లేదని ఆయన ఆరోపించారు. ఇక, కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుపడుతున్నారనే విమర్శ ఎప్పట్నుంచో ఉన్నదే. ఇంతకీ, అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఎవరు..? ఒకిరిపై ఒకరు వేలెత్తి చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప… పనులు ఏరకంగా ముందుకు వెళ్తాయనే ప్రయత్నం ఇరు పార్టీల నేతలూ చేయడం లేదు. ప్రతీ పనిలోనూ రాజకీయ లబ్ధి కోసమే రెండు పార్టీలూ పాకులాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న అధికార పార్టీలుగా వ్యవహరించడం లేదు! సమాఖ్య స్ఫూర్తిని పాటిస్తూ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలన్న ఉద్దేశం రెండు పార్టీల్లో కనిపించడం లేదు. మేం పనిచేస్తే మాకే పేరు రావాలన్న లాభాపేక్ష మైండ్ సెట్ తో నాయకులుంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలూ ముందుకు వెళ్లవు.