కాంట్రాక్టుల రద్దుపై ఏపీ సర్కార్ తో… తాడో పేడోతేల్చుకోవాలని నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ రెడీ అయినట్లుగా… తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లపై.. హైకోర్టుకు ఎక్కి .. మధ్యంతర విజయం సాధించిన నవయుగ కంపెనీ.. తాజాగా మచిలీపట్నం పోర్టు విషయంలోనూ… ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని కొట్టి వేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్ వేసింది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. ఏపీ సర్కార్ ఆగస్టు ఎనిమిదో తేదీన జారీ చేసిన అరవై ఆరో నెంబర్ జీవోను రద్దు చేయాలని కోర్టులో వేసిన పిటిషన్లో నవయుగ సంస్థ కోరింది. పనులు ఇతర సంస్థలకు అప్పగించకుండా ఆదేశించాలని కోరింది. జీవోలో ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెప్పిందని.. తాము పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించలేదని.. నయువగ తెలిపింది.
నవయుగ హైకోర్టులో పిటిషన్ వేస్తున్న సమయంలోనే… మంత్రివర్గ సమావేశంలో.. బందరు పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ… ఆ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ.. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. నవయుగ మాత్రం ప్రభుత్వమే.. ఒప్పందం మేరకు అవసరమైన భూములను తమకు అప్పగించడంలో విఫలమైందని పిటిషన్లో పేర్కొంది. పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన రవాణా, విద్యుత్ తదితర సదుపాయాలను కూడా సమకూర్చలేదని, అందువల్ల ప్రభుత్వమే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లయిందన్నారు. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేశామని నవయుగ కోర్టుకు తెలిపింది.
బందరుపోర్టు అభివృద్ది ఒప్పందాన్ని ఇండియన్ కాంట్రాక్టు యాక్టు 1872 ప్రకారం… ఏపీ సర్కార్ రద్దు చేసింది. రద్దు చేసే సమయానికి బందరు పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. నవయుగ సంస్థ ప్రాజెక్టు స్థలం వద్దకు భారీ యంత్రాలను తరలించి… పనులను కూడా ప్రారంభించింది. పరిమితంగానే స్థలం స్వాధీనం చేసినా… కాస్త వేగంగా నవయుగ పనులు చేస్తోంది. అయితే ప్రభుత్వం మారగానే… పనులు నిలిచిపోయాయి. పోలవరం విషయంలో కోర్టుకెళ్లి… కాంట్రాక్టుల రద్దుపై స్టే తెచ్చుకున్న నవయుగ.. మచిలీపట్నం పోర్టు విషయంలోనూ.. అదే ఫలితాన్ని ఆశిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేయాలంటే.. ప్రభుత్వం పాటించాల్సిన కొన్ని నిబంధనలు పాటించకపోవడం.. నవయుగకు మేలు చేస్తుందన్న అభిప్రాయం.. న్యాయవాద వర్గాల్లో ఉంది.